https://oktelugu.com/

Valentine’s Day: ఈ ప్రాంతాల్లో ప్రేమికుల దినోత్సవం ప్రత్యేకం

ఫిబ్రవరి 14ను ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం గా జరుపుకుంటారు. కానీ ఉత్తర ఐరోపాలోని ఈస్టోనియా దేశంలో ప్రేమికుల దినోత్సవం రోజును స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 14, 2024 / 10:51 AM IST
    Follow us on

    Valentine’s Day: ప్రేమ పరిచయమే.. దైవ దర్శనమే.. అని ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేమికులు పాడుకుంటూ ఉంటారు. మనసుకు నచ్చిన వ్యక్తులు కళ్ళ ముందే ఉండటంతో.. గుండెలకు హత్తుకుంటారు. లెక్కలేనన్ని మాటలు చెప్పుకుంటారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ ప్రాంతాల్లో ప్రేమికుల దినోత్సవం విభిన్నంగా జరుగుతుంది. ఇంతకీ ఆ ప్రాంతాలు ఏమిటో.. అక్కడ వేడుకలు అలా ఎందుకు జరుపుకుంటారో.. ఈ కథనంలో తెలుసుకుందాం..

    ఫిబ్రవరి 14ను ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం గా జరుపుకుంటారు. కానీ ఉత్తర ఐరోపాలోని ఈస్టోనియా దేశంలో ప్రేమికుల దినోత్సవం రోజును స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు స్నేహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. దూరంగా ఉంటున్న స్నేహితుల కైతే పోస్టులో గ్రీటింగ్ కార్డులు పంపిస్తారు. స్నేహితులు మాత్రమే కాదు బంధువులు కూడా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

    బల్గేరియా దేశంలో వాలెంటైన్స్ డే ను వైన్ డే గా జరుపుకుంటారు. ఈరోజు జంటలు ఏకాంతంగా గడుపుతాయి. దూరమైన ప్రదేశాలకు వెళ్లి ఒకరికి ఒకరు వైన్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ తర్వాత తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.

    ఫిలిప్పైన్స్ లో ప్రేమికుల దినోత్సవం రోజు సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. వేలాది మంది ప్రేమికులు వివాహ బంధంతో ఒకటవుతారు. ఈ వివాహాలను అక్కడి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరఫున కానుకలు కూడా అందిస్తుంది. కొవిడ్ మిగతా అన్ని సంవత్సరాలు ఇక్కడ నిరాటంకంగా ఫిబ్రవరి 14 రోజున సామూహిక వివాహాలు జరుగుతుండడం విశేషం.

    ఫిబ్రవరి 14ను ఘనా దేశం 2007 నుంచి జాతీయ చాక్లెట్ దినోత్సవంగా మార్చింది. చాక్లెట్ తయారీకి ఉపయోగించే కోకో గింజలను ఘనా దేశం అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడుకల ద్వారా తమ దేశానికి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించాలనేది తమ ఉద్దేశమని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో 2007 నుంచి ఫిబ్రవరి 14న జాతీయ చాక్లెట్ దినోత్సవం గా జరుపుతోంది. ఫిబ్రవరి 14 రోజున ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చాక్లెట్ థీమ్, మెనూ లను, ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తారు.

    ఇక దక్షిణ కొరియా దేశంలో ఫిబ్రవరి 14 రోజున ప్రేమికులు విభిన్నంగా వేడుకలు జరుపుకుంటారు. ఇక్కడ ప్రతినెల 14న ప్రేమికుల దినోత్సవం గా జరుపుకుంటారు. అయితే ఫిబ్రవరి 14, మార్చి నెల 14 కు అక్కడ మరింత ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 14 రోజున మగవాళ్ళకు ఆడవాళ్లు చాక్లెట్లు బహుమతిగా ఇస్తారు. పురుషులు వెంటనే కాకుండా మార్చి 14న తమ ఇష్ట సఖులకు చాక్లెట్లు తిరిగి బహుమతిగా ఇస్తూ ఉంటారు. దీనిని ఆ ప్రాంతంలో వైట్ డే గా పిలుస్తుంటారు. ఇక ఏప్రిల్ 14న అక్కడ బ్లాక్ డే నిర్వహిస్తారు. దీని వెనుక కూడా ఒక నేపథ్యం ఉంది.. గడచిన రెండు నెలల్లో ఎటువంటి బహుమతులు అందుకొని సింగిల్స్ ఒక్కచోట చేరి నూడిల్స్ తింటారు. అందులో బ్లాక్ బీన్ సాస్ వేసుకొని తింటారు. ఏప్రిల్ 14న బ్లాక్ డే కాబట్టి వారు బ్లాక్ సాస్ వేసుకొని తింటారు.

    వేల్స్ దేశంలో ప్రేమికుల దినోత్సవాన్ని జనవరి 25న జరుపుకుంటారు. దీనిని వారు డే ఆఫ్ సాన్ డ్వైన్ వెన్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. రోజు చెక్కతో తయారైన చెంచాలను ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రత్యేకంగా హృదయం ఆకారంలో ఉండే చెంచాను తమ మనసుకు నచ్చిన వారికి ఇస్తూ ఉంటారు. ఈ ఆచారం ఇక్కడ 16వ శతాబ్దం నుంచి మొదలైందని తెలుస్తోంది.

    చెక్ రిపబ్లిక్ దేశంలో ప్రేమికుల దినోత్సవం మే 1న జరుపుకుంటారు. ఆరోజు దేశంలో ఉన్న ప్రేమికులు మొత్తం అక్కడి కవి కరేల్ హైనెక్ మచా విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఉండే చెర్రీ చెట్ల కింద తమ ఇష్ట సఖులను ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి బంధం ఎప్పటికీ బలంగా ఉంటుందని నమ్ముతారు.