Valentine’s Day: నేటి కాలంలో ప్రేమ(Love) అనేది ఇన్ స్టంట్ అయిపోయింది. “ప్రే” అంటే ప్రేమించుకోవడం.. “మ” అంటే మర్చిపోవడం పరిపాటిగా మారింది.. నచ్చిన అమ్మాయి ప్రేమించక పోతే దాడి చేయడం.. సామాజిక మాధ్యమాలలో(social media) వ్యక్తిత్వ హననానికి పాల్పడడం వంటి ఘటనలు పెరిగిపోయాయి.. ఇలాంటి దారుణాలు జరుగుతున్న చోట.. ఐతే కొన్ని ప్రేమ గాథలు( Love stories) గొప్పగా ఉంటాయి నిజమైన ప్రేమకు నిలువెత్తు సాక్షిభూతం లాగా నిలుస్తాయి. అలాంటిదే ఈ కథ కూడా..
అది తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవాపురం.. ఈ గ్రామంలో కుమార్ – మమత ప్రేమించుకున్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడే వీరిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. వీరిద్దరి వ్యవహారం ఇంట్లో తెలిసింది.. కులాలు వేరు కావడంతో మమత తరపు వారు వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేక.. 2009లో పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే కుమార్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. తన చదువును మధ్యలోనే ఆపేశాడు. తన భార్యను కష్టపడి చదివించాడు.. కుటుంబ పోషణ కోసం ఆటోను తోలడం మొదలుపెట్టాడు.. పగలు రాత్రి తేడా లేకుండా ఆటో తోలుతూ ఇంటి వ్యవహారాలు చూసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను చదివించాడు. దాదాపు 11 సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూనే.. ఆటో తోలుకుంటూనే.. తను కూడా చదువుకున్నాడు. చివరికి 2020లో మమత గురుకుల హై స్కూల్ పిఈటిగా ఎంపికైంది. ప్రస్తుతం ఆమె భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్నది. కుమార్ కూడా కష్టపడి చదివి గురుకుల హైస్కూల్లో పిఈటిగా ఉద్యోగం సాధించాడు. వాస్తవానికి మమత, కుమార్ కు పీఈటీలుగా కాకుండా ఇతర ఉద్యోగాలు కూడా వచ్చాయి. అయితే ఫిజికల్ టీచర్లుగా పని చేయడమే ఇష్టంగా ఉండడంతో.. ఆ ఉద్యోగాలలో చేరకుండా ఉండిపోయారు. ప్రస్తుతం వారిద్దరికీ ఇద్దరు పిల్లలు.. ఇద్దరూ జనగామ జిల్లాలోనే పనిచేస్తున్నారు..
ప్రేమను సార్ధకం చేసుకున్నారు
వయసు వేడిలో.. ఉరకలెత్తే ఉత్సాహంలో.. కన్ను మిన్ను కాకుండా వ్యవహరించేవారు ఈ రోజుల్లో పెరిగిపోయారు..దానికి ప్రేమ అని పేరు పెడుతూ.. వివాహానికి ముందే శారీరక అవసరాలు తీర్చుకుంటూ.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం వంటి ఘటనలు పెరిగిపోయాయి. దీనివల్ల స్వచ్ఛ మైన ప్రేమ అనేది కనుమరుగైపోయింది.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కుమార్ – మమత లాంటివారు ప్రేమను గెలిపించుకొని.. దానికి నిజమైన సార్ధకాన్ని నిలుపుతున్నారు. పెద్దలను ఎదిరించి.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకుని.. ఎవరైతే వారిని కాదన్నారో.. వారి ముందే సగర్వంగా తల ఎత్తుకొని నిలబడుతున్నారు. మొదట్లో కుమార్ తో మమత వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. కొద్దిరోజులపాటు మాట్లాడలేదు. అయితే వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యుల మనసు కరిగింది. ఇప్పుడు కుమార్ ను తమ అల్లుడిగా మమత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.. నిజమైన ప్రేమకు కులం ఉండదని.. మతం అడ్డంకి కాదని.. లక్ష్యం సూటిగా ఉంటే ప్రేమ దానికి అండగా ఉంటుందని నిరూపించారు కుమార్ – మమత. నేటి ఇన్ స్టంట్ లవ్ ల కాలంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. వాలెంటైన్స్ డే (valentine’s day) రోజు ఇలాంటి వాళ్ల విజయ ప్రేమ గాథలే(sucessful Love stories) సమాజానికి కావాల్సింది.