
Valentine Day Special: నీ సుఖమే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళ్తున్నా అన్నాడు ఆత్రేయ. ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రేమించే వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటారు. వారి కోసమే తమ జీవితాన్ని అర్పిస్తారు. అదే నిజమైన ప్రేమ. అంతేకాని పార్కుల్లో, సినిమా హాల్లో, పబ్బుల్లో పుట్టేది ప్రేమ కాదు కామం. ఆకర్షణతో పుట్టేది ప్రేమ కానే కాదు. బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే గొప్పది. ఇది ఎవరు కాదనలేనిది. కానీ అందరు అందానికే మొగ్గు చూపుతారు. అందంగా ఉంటే ప్రేమిస్తారు. లేదంటే వదిలేస్తారు. అందంలో ఏముంది ఆకర్షణ తప్ప. మంచి మనసును ప్రేమించిన వాడు జీవితంలో సుఖపడతాడు. అందానికి ఆకర్షణకు గురైన వాడు కష్టపడటం ఖాయం.
వాలంటైన్ డే..
ప్రేమకు ఆరాధ్యుడు వాలంటైన్. అతడిని ఉరితీసిన రోజునే వాలంటైన్ డే గా జరుపుకుంటారు. ప్రేమను బతికించడం కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు. ప్రేమికులను కలిపేందుకు తన సర్వస్వాన్ని త్యజించాడు. ప్రేమ వివాహాలను ప్రోత్సహించాడు. దీంతోనే ప్రేమికులు వాలంటైన్ ను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో వాలంటైన్ చేసే కార్యక్రమాలకు రోమ్ చక్రవర్తి క్లాడియన్ కూతురు కూడా ఆకర్షితురాలు అవుతుంది. అతడిని ఆరాధిస్తుంది. దీంతో చక్రవర్తి వాలంటైన్ కు మరణశిక్ష విధిస్తాడు. ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు.
వాలంటైన్ చనిపోయిన రోజును..
రెండు దశాబ్ధాల తరువాత అప్పటి పోప్ గెలిసియన్స్ వాలంటైన్ చనిపోయిన రోజును ప్రేమికుల దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 14ను ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రేమలో నిజాయితీ ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తుంది. కానీ ఇద్దరిలో ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే ప్రేమ సుఖాంతం కావడం కష్టమేమీ కాదు. ప్రేమికుల్లో ఉండే నమ్మకమే వారిని పెళ్లి దాకా నడిపిస్తుంది. ప్రేమను బతికించేలా చేస్తుంది. ప్రపంచంలో ఎందరో ప్రేమికులు ప్రేమకోసం ఎన్నో త్యాగాలు చేసిన వారు కూడా ఉన్నారు.
ప్రేమగా ..
ఈ సృష్టే ప్రేమమయం. ప్రేమతో దగ్గరకు తీసుకుంటే ఏ ప్రాణి అయినా మనల్ని ప్రేమిస్తుంది. ద్వేషం చూపితే ఏదైనా దూరం అవుతుంది. ప్రేమను ప్రేమతోనే పొందాలి కానీ ద్వేషంతో కాదని తెలుసు. ప్రేమను వ్యక్తం చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కొందరు గిఫ్ట్ లు ఇస్తారు. ఇంకొందరు చాక్లెట్లు, మరికొందరు ఇతర పద్ధతుల్లో తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ప్రేమికుల దినోత్సవానికి ముందు వారం నుంచే ప్రేమికుల సందడి కనిపిస్తుంది. తను ప్రేమించే వారి కోసం ఎలా చెప్పాలని మల్లగుల్లాలు పడుతుంటారు.
తొమ్మిదేళ్లుగా..
కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన కట్ల అర్షిత్, భగవతిల ప్రేమ తొమ్మిదేళ్ల నాటిది. ప్రేమించి పెళ్లి చేసుకుని వారు ప్రేమను బతికించుకుంటూ బతుకుతున్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఇప్పటికి కూడా తరగలేదు. తొమ్మిదేళ్ల నాటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఒకరిని విడిచి మరొకరు ఉండటం లేదు. ప్రేమంటే ప్రేమను వ్యక్తం చేయడం కాదు. ఆ ప్రేమను కలకాలం బతికించుకోడమే నిజమైన ప్రేమగా అభివర్ణిస్తుంటారు. ప్రేమికుల రోజును ప్రేమగా జరుపుకోవడం కన్నా ప్రేమను బతికించుకుంటే వారు నిజమైన ప్రేమికులుగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

2013 అక్టోబర్ లో హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చేస్తుండగా కలుసుకున్నారు. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కానీ జీవితంలో స్థిరపడే వరకు పెళ్లి వద్దని అనుకున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సాధించాక 2022లో హైదరాబాద్ లోనే ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు తొమ్మిదేళ్లు ప్రేమలో ఉండటం అంటే మాటలు కాదు. ప్రస్తుతం రోజుకో విధంగా మనసు మార్చుకుంటున్న పరిస్థితుల్లో వారు ఏకంగా తొమ్మిదేళ్లు ఆగి మరి పెళ్లి చేసుకోవడం విశేషం. ప్రేమంటే ఇదేనేమో. ప్రేమికులంటే వీరే అని అనిపిస్తుంది.