
Preeti Case: వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ లో చదువుతున్న మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు పోలీసులు సరిగా కేసు దర్యాప్తు చేయడం లేదు, సైఫ్ తన కూతుర్ని చంపేశాడని ఆరోపిస్తూ వచ్చిన ప్రీతి తల్లిదండ్రులు నరేందర్, అతడి భార్య శనివారం యూటర్న్ తీసుకున్నారు.. దీంతో ఈ కేసులో మరో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.
శుక్రవారం ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ రావడంతో.. వరంగల్ సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రీతి ముమ్మాటికి ఆత్మహత్య చేసుకుందని, ఆమె శరీరంలో హత్య చేసిన తాలూకూ ఆనవాళ్లు కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు.. ఇదే సమయంలో సైఫ్ మీద మరో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఆయన ప్రకటించారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకుందనే తాము ఒక నిర్ధారణకు వచ్చామని సిపి వివరించారు.

అనంతరం శనివారం ప్రీతి తల్లిదండ్రులకు కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు సిపి వారిని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. అయితే కార్యాలయానికి వెళ్లే క్రమంలో ప్రీతి తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడారు. ఏ కేసు దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, సైఫ్ వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని, ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది తన కూతురు కాదని వారు వివరించారు. అనంతరం వారు సిపి కార్యాలయానికి వెళ్లారు. కేసు వివరాలకు అందించిన పూర్తి సమాచారాన్ని సిపి ప్రీతి తల్లిదండ్రులకు వివరించారు. ఆయన చెప్పిన వివరాలతో ప్రీతి తల్లిదండ్రులు యూటర్న్ తీసుకున్నారు. దర్యాప్తు చేసిన విధానంతో ఏకీభవించి బయటికి వచ్చారు. లోపల ఏం జరిగిందని విలేకరులు ప్రశ్నించగా కేసు కు సంబంధించి తమ ఆరోపణలు మొత్తం వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో తెల్లబోవడం మీడియావంతయింది.