https://oktelugu.com/

Rajasthan : కోచింగ్ కు డబ్బుల్లేవు.. కానకష్టమైనా.. ఈ గొర్రెల కాపరి కూతురు నీట్ కొట్టిందిలా

ఉపేంద్ర యాదవ్, కరీనా యాదవ్. ప్రాథమిక స్థాయి నుంచే వైద్యులు కావాలని సంకల్పించారు. అలిండియా స్థాయిలో జరిగిన నీట్స్ లో మెరుగైన ర్యాంకులు సాధించారు. వైద్య వృత్తికి అర్హత సాధించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 25, 2023 2:24 pm
    Follow us on

    Rajasthan : ఊరి కోసం డాక్టర్లు కావాలని బలంగా సంకల్పించారు ఆ పిల్లలు. అలాగని వారు ఆర్థిక స్థితిమంతులైన కుటుంబానికి చెందిన వారు కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. అయినా సరే వైద్య వృత్తిలో స్థిరపడి తమ గ్రామానికి సేవలందించాలని బలమైన సంకల్పంతో అడుగులేశారు.  అనుకున్నది సాధించారు. నీట్స్ లో మంచి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. కన్నవారి కలలను, గ్రామస్థుల ఆశలను సాకారం చేశారు. పట్టుదల, సంకల్పం ఉండాలే కానీ.. అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు. చదువులో రాణించాలంటే గొప్పింటి పిల్లలే కానవసరం లేదని చేసి చూపించారు.
    అది రాజస్థాన్ లోని ఓ కుగ్రామం. కనీసం ఆ గ్రామానికి బస్సు సదుపాయం కూడా ఉండదు. వైద్య సదుపాయం కోసం వెళ్లాలంటే 18 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. అత్యవసర, అనారోగ్య సమయాల్లో గ్రామస్థులు పడే బాధలు వర్ణనాతీతం. ఆ బాధలు కళ్ళారా చూశారు ఉపేంద్ర యాదవ్, కరీనా యాదవ్. ప్రాథమిక స్థాయి నుంచే వైద్యులు కావాలని సంకల్పించారు. అలిండియా స్థాయిలో జరిగిన నీట్స్ లో మెరుగైన ర్యాంకులు సాధించారు. వైద్య వృత్తికి అర్హత సాధించారు. దీంతో కుటుంబంలో, ఆ గ్రామంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
    ఈ ఇద్దరి విద్యార్థుల తల్లిదండ్రులు గొర్రెల కాపరులు. వాటితోనే జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలు. అయినా సరే మొక్కవోని దీక్షతో చదువుకున్నారు. కోచింగ్ కు డబ్బులు లేకపోయినా.. తలకు మించి భారమైనా.. కన్నవాళ్లు వ్యయప్రయాసలకోర్చి వారిని చదివించారు. ఆ పిల్లలు కూడా  తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు గుర్తెరిగి మసులుకున్నారు. గ్రామంలో మెరుగైన వైద్యసేవలే తమ అభిమతంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సోషల్ మీడియాలో మెరిసిపోతున్నారు. నెటిజన్ల నుంచి వీరికి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి.