https://oktelugu.com/

Uttar Pradesh: రామ్ లీలా నాటకంలో.. అనుకోని ఘటనలు.. నిర్ఘాంతపోయిన భక్తులు.. వీడియో వైరల్

దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఒక్కోచోట ఒక్కో సాంప్రదాయంలో దసరా వేడుకలను ప్రజలు జరుపుకున్నారు. రాముడు కొలువై ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దసరా వేడుకలను ప్రజలు విభిన్నంగా నిర్వహించుకున్నారు. దసరా రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆమ్రేహ జిల్లాలో ప్రదర్శించిన రామ్ లీలా నాటకం సంచలనాన్ని సృష్టించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 14, 2024 9:51 pm
    Uttar Pradesh(2)

    Uttar Pradesh(2)

    Follow us on

    Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆమ్రేహ జిల్లాలో ప్రతి ఏడాది దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో రాముడు నడయాడాడని.. రాముడు సీతాదేవితో సంచరించాడని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు. పైగా చారిత్రక ఆనవాళ్లను విశేషంగా పూజిస్తుంటారు. అయితే ఇక్కడ రాముడుని రామ్ లల్లా గా ప్రజలు పిలుచుకుంటారు. దసరా సందర్భంగా రాముడు కొలువై ఉన్న మందిరాలను శుభ్రం చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. జమ్మి చెట్టుకు మామిడి తోరణాలు కట్టి.. జమ్మి ఆకును జేబులో పెట్టుకొని శుభం కలగాలని మొక్కుకుంటారు. కొందరైతే జమ్మి చెట్టు ముందు కొబ్బరికాయలు కొడతారు. పాలు, తేనె, చక్కెర, యాలకులు, కుంకుమపువ్వు మిశ్రమంతో కలిపి చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా నైవేద్యం సమర్పించడం వల్ల జమ్మి చెట్టు మరింత పచ్చగా మారుతుందని.. అలా మారడం వల్ల తమ జీవితాల్లో శుభం కలుగుతుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. జమ్మి చెట్టుకు పూజలు ముగిసిన తర్వాత రాత్రిపూట రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఈసారి జరిగిన రామ్ లీలా నాటకంలో సంచలనం చోటుచేసుకుంది.. ఆమ్రేహ జిల్లా గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సేలంపూర్ గోన్సాయి గ్రామంలో రామ్ లీలా నాటకాన్ని ఘనంగా ప్రదర్శించారు. అయితే నాటకం చివర్లో ఉండగా రాముడు- లక్ష్మణుడు రావణుడితో భీకరమైన యుద్ధం చేశారు. ముందుగా ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకున్నారు. ఈ క్రమంలో రావణాసురుడి పాత్రధారి ఆవేశం తట్టుకోలేక రాముడి పాత్రధారుడిని వేదిక మీద నుంచి కిందికి తోసి వేశాడు. దీంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది.

    ప్రేక్షకులు జోక్యం చేసుకోవడంతో..

    కింద ఉండి నాటకాన్ని వీక్షిస్తున్న వారంతా వేదిక మీదకు వెళ్లారు. వారంతా జోక్యం చేసుకొని.. విడిపించారు. గందరగోళం నెలకొనడంతో ఒక్కసారిగా నాటకాన్ని నిలిపివేశారు. ఈ దృశ్యాలను కొంతమంది తమ కెమెరాలలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇక ఇదే కాకుండా మరో ప్రాంతంలో జరిగిన రామ్ లీలా ప్రదర్శనలో రాముడు, హనుమంతుడి పాత్రధారులు వేదిక పైన కొట్టుకున్నారు.. రామాయణంలో ఒక ఘట్టం ప్రదర్శిస్తుండగా.. లక్ష్మణుడు ఒక్కసారిగా మూర్చ పోతాడు.. మూర్చ పోయిన లక్ష్మణుడిని రాముడి పాత్రధారి పరామర్శిస్తుండగా.. హనుమంతుడి పాత్రధారి కాలితో తన్నాడు. దీంతో రాముడి పాత్రధారి, హనుమంతుడి పాత్రధారి పరస్పరం కొట్టుకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో అక్కడున్న వ్యక్తులు వేదిక పైకి వెళ్లి.. ఆ పాత్రధారులిద్దరికీ సర్ది చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది.