
TSPSC Paper Leak Case: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో లోపాలు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కమిషన్ లో ఇంటి దొంగలు పాతుకుపోయి.. ఇస్టానుసారంగా వ్యవహరించారు. ఏకంగా పాతికమంది అవుట్ సోర్సింగ్, శాశ్వత సిబ్బంది కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాశారు. వారిలో పదిమంది క్వాలిఫై అయ్యారు. మార్కులు సాధించారు.. అసలు కమిషన్ లో పనిచేసే ఉద్యోగులు ఎంత మంది పరీక్షలు రాశారు? వారిలో ఎంతమంది నిరభ్యంతర పత్రం తీసుకున్నారు? అనేదానిపై కమిషన్ ఇప్పటివరకూ మెదపడం లేదు. వాస్తవానికి అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, గోల్కొండ చౌరస్తాలో పేరుమోసిన మూడు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొన్న లో 25 మంది మాత్రమే గ్రూప్ వన్ మెయిన్స్ కు అర్హత సాధించారు.. ఏమాత్రం సన్నద్ధం కాకుండానే పరీక్షలు రాసిన కమిషన్ ఉద్యోగులు 10 మంది మెయిన్స్ కు అర్హత సాధించడం, వారికి ప్రిలిమ్స్ లో 100కు పైగా మార్కులు రావడం విశేషం.
వాస్తవానికి కమిషన్ లో 65 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 83 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు. కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో వీరందరిలో వయసు, రిజర్వేషన్ రీత్యా అర్హులు 50 మందికి మించరు. వారిలో గ్రూప్_1 కు దరఖాస్తు చేసుకున్నవారు పాతిక మంది దాకా ఉంటారు. ఇప్పటివరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో ప్రవీణ్ సహా 10 మందికి లీకేజీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. రమేష్, వెంకటేష్, వెంకటేశ్వరరావు, షమీం, మరో ఐదుగురు ఉద్యోగులకు ప్రిలిమ్స్ లో 100కు పైగా మార్కులు వచ్చాయి. ఏ కోచింగ్ సెంటర్లోనైనా, రేగింబవళ్లు కష్టపడి చదివే బృందాల్లోనైనా పాతిక శాతానికి మించి మెయిన్స్ కి అర్హత సాధించిన చరిత్ర లేదని విషయ నిపుణులు/ ఫ్యాకల్టీలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. అలాంటిది కమిషన్ లో పాతికమందిలోపు పరీక్ష హాజరైతే వారిలో పదిమంది క్వాలిఫై అవడం ఇక్కడ అనుమానించాల్సిన విషయం.
ప్రిలిమ్స్ పేపర్లో 75% అనలెటిక్, 25% ఫ్యాక్చువల్ ప్రశ్నలతో యుపిపిఎస్సి ని మించి కఠినంగా వచ్చిన ప్రశ్న పత్రాన్ని వీరంతా ఎలా క్రాక్ చేయగలిగారు, అది కూడా 100కు పైగా మార్కులు ఎలా వచ్చాయనేది అంతుపట్టకుండా ఉంది. ప్రిలిమ్స్ లో 80-90 మార్కులు రావడం గగనం. అది కూడా మూడు నుంచి ఐదు సంవత్సరాలు కష్టపడితే తప్ప వచ్చే అవకాశం లేదు. కానీ కమిషన్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే ఉద్యోగికి 120 మార్కులు ఎలా వచ్చాయి? మిగతా ఉద్యోగులకు వందకు పైగా మార్కులు రావడం భారీ కుట్రగా కనిపిస్తోంది.

ఈ వ్యవహారం కొనసాగుతుండగానే ప్రశ్నపత్రాల లీకేజీ పై కమిషన్ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరుతో టీఎస్ పి ఎస్ సి జిరాక్స్ సెంటర్ అంటూ బుధవారం ఉదయం పోస్టర్లు వేశాయి. ఇక్కడ అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ ప్రశ్న పత్రాలు లభిస్తాయంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.. నిన్న ట్విట్టర్లో ఉగాది వేడుకకు సంబంధించి వ్యంగంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ కు.. ఈ పోస్టర్ల ద్వారా నెటిజెన్లు కౌంటర్ ఇస్తున్నారు..” ఇది నువ్వు చెప్పే బంగారు తెలంగాణలో పరిస్థితి అంటూ” నిలదీస్తున్నారు.