Troll Of The Day: మంత్రాలకు చింతకాయలు రాలవు. రాయి పెట్టి కొడితేనో… కర్ర పెట్టి దులిపితేనో రాలుతాయి.. ఈ మాత్రం చెప్పేందుకు పై నుంచి దేవుడే దిగి రావాల్సిన అవసరం లేదు.. కానీ అదేదో సమస్య అయినట్టు… దానికోసం ఒక జ్యోతిష్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉన్నట్టు… ఎవరో ఒకరు మీకు సలహా ఇస్తే ఎలా ఉంటుంది.. చదువుతుంటే అంతా తిక్క తిక్కగా ఉంది కదా… సరే మీకు అర్థమయ్యేలా మరో విధంగా చెప్తాం.. మీరు ఫేస్బుక్ సర్ఫింగ్ చేస్తున్నారు.. ఈలోగా కామెంట్ లిస్టు చెక్ చేస్తున్నారు.. ఇదే సమయంలో “శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం.. మీ సమస్యలు మొత్తం తీర్చబడును” అని ఎప్పుడైనా చూశారా.. చూస్తే మీకు ఎలా అనిపించింది.. ఎక్కడో కాలింది కదా! అలా పెట్టేవాన్ని గూబ మీద ఒక్కటి ఇవ్వాలి అనిపించింది కదా… మీకేంటి మీ స్థానంలో ఉన్న ఎవరికైనా అలానే అనిపిస్తుంది.

డిఫరెంట్ ప్రచారం
అలా సామాజిక మాధ్యమాల్లో కామెంట్ బాక్స్ లో వారి గురించి చెప్తే పెద్దగా జనాల్లో రీచ్ రావడం లేదని తెలిసి… ఈసారి కొత్తగా ప్లాన్ చేశారు.. ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వస్తారు. వెనకాల కూర్చున్న వ్యక్తి ఐదు చేతివేళ్లను చూపిస్తాడు.. అది 500 కు సంకేతం అనుకొని అదే డబ్బుకు సరిపడా బంకు లో పనిచేసే వ్యక్తి పెట్రోల్ పోస్తాడు.. తీరా డబ్బులు అడిగితే వారు చేతిలో 50 రూపాయలు పెడతారు.. దీనికి పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి వారిస్తాడు.. వారి మధ్య వాగ్వాదం జరుగుతుంది.. ఈలోగా మరో వ్యక్తి బండి మీద వస్తాడు.. ఆ ఇద్దరు వ్యక్తులకు బుద్ధి చెప్తాడు.. అదే సమయంలో ఆ బంకులో పని చేసే వ్యక్తిని గుర్తుపడతాడు. ఆ బంకు వద్ద పనిచేసిన వ్యక్తి, పంచాయితీ సెటిల్ చేసిన వ్యక్తి స్నేహితులు.. ఒకే కాలేజీలో చదువుకున్నవారు.. కానీ అతని అదృష్టం బాగా లేక బంకులో ఉద్యోగానికి కుదిరాడు.. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగా బంకులో పనిచేస్తున్న వ్యక్తి తన కష్టాలు చెప్పుకుంటాడు.. ఈలోగా సదరు స్నేహితుడు జ్యోతిషాలయాన్ని సందర్శించమని ఉచిత సలహా ఇస్తాడు.. మొదట్లో ఎంతో బాధాకరంగా సాగిన ఈ వీడియో… ఎండింగ్ లో మాత్రం ఎక్కడా లేని బీపీని తెప్పించింది.

అసలు నమ్మొద్దు
ఇలాంటి జ్యోతిషాలను, జ్యోతిష్కులను అసలు నమ్మకూడదు.. ప్రస్తుతం అరచేతిలో ప్రపంచం ఇమిడి పోతున్న ఈ రోజుల్లో జ్యోతిషాలు, మూఢనమ్మకాలు అంటూ తిరిగితే మొదటికే మోసం వస్తుంది. ప్రజల బాధలను ఆసరాగా తీసుకొని కొంతమంది జ్యోతిష్యుల అవతారం ఎత్తుతున్నారు. ప్రజలను బురిడీ కొట్టించి దండుకుంటున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో… ఈ వీడియోలు చేసి అమాయక ప్రజలను ఈజీగా మోసం చేస్తున్నారు.. ఇలాంటి ప్రకటనల పట్ల, పోస్టింగుల పట్ల అస్సలు ఆకర్షితులు కావద్దు.. వారిని నమ్మి అస్సలు మోసపోవద్దు.