
KL Rahul సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ కావొచ్చు. సెంచరీల మోత మోగించి ఉండవచ్చు. ఫోర్లు, సిక్స్ లు అలవోకగా కొట్టి ఉండవచ్చు. కానీ ఫామ్ లో లేనప్పుడు మేనేజ్మెంట్ నిర్ణయంతో నిర్దాక్షిణంగా బయటకు వెళ్ళిపోయాడు..అంటే ఎంత తోపు ప్లేయర్ అయినా ఫామ్ లో లేకుంటే…జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడకపోతే బయటకి వెళ్లాల్సిందే.. ఇందులో ఎవరికైనా కొంత మినహాయింపు లభిస్తుందేమో కానీ… అంతిమంగా ఆడితేనే, ఆడ కలిగితేనే జట్టులో స్థానం ఉంటుంది.
రాహుల్ భయ్యా పై మీమ్స్
టీమిండియాలో గత కొంతకాలంగా ఫామ్ లేమితో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతున్నాడు.. సింగిల్ డిజిట్ స్కోర్ కే ఔట్ అవుతున్నాడు. ఓపెనర్ గా వెళ్ళి ఏదో అర్జెంటు పని ఉందన్నట్టు డ్రెస్సింగ్ రూమ్ కి వస్తున్నాడు. టెస్ట్, వన్డే, టీ 20 ఇలా ఏ ఫార్మాట్ లోనూ క్లిక్ కాలేకపోతున్నాడు.
ఇక బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్ ల్లో కేఎల్ రాహుల్ వెంట వెంటనే అవుట్ అయ్యాడు. దీని పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని చురకలు అంటించారు. మొదటి టెస్టులో విఫలమైన అతడు రెండవ టెస్టులోనూ అదే తీరు కనబరిచాడు. మొదటి టెస్టులో రాణించకపోయినప్పటికీ టీం మేనేజ్మెంట్ గిల్ లాంటి ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి.. అతడికి అవకాశం ఇచ్చింది. కానీ ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతను వరుసగా విఫలమవుతున్నప్పటికీ… కెప్టెన్, కోచ్ అండదండలతో జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. వైస్ కెప్టెన్సీ కూడా అతడికి రక్షణగా మారింది. అయినప్పటికీ క్రీజు లో కుదురుకోలేక పోతున్నాడు. దీంతో రాహుల్ భయ్యా పై మీమ్స్ వర్షం కురుస్తోంది.

అఖిల్ ను తీసుకుంటే బెటర్
ప్రస్తుతం సెలబ్రిటీ లీగ్ జరుగుతోంది. ఇందులో అఖిల్ వీర విహారం చేస్తున్నాడు. ఆదివారం జరిగిన ఓ మ్యాచ్ లో కేవలం 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. దీంతో మీమర్స్ రెచ్చిపోతున్నారు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రాహుల్ ను సీసీఎల్ ఆడించి, అఖిల్ ను ఇండియన్ టీం లో ఆడించాలని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.