OTT Releases This Week: సినిమా అంటే వందలాది మంది కష్టం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఆధారం. అలాంటి సినిమా భవిష్యత్తు ఒక్క శుక్రవారంతో తేలిపోతుంది. విజయవంతం అయితే అవకాశాలు వస్తాయి. ప్రేక్షకులు తిరస్కరిస్తే అవకాశాలు పోతాయి.. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక జూదం. రంగుల ప్రపంచంలో తెర పైకి కనిపించని మాయావినోదం.. సరే ఇప్పుడంతా టెక్నాలజీ యుగం కాబట్టి.. సినిమా కూడా అరచేతిలోకి వచ్చేసింది. థియేటర్ ను దాటి ఓటీటీ ద్వారా ఒక థంబ్ టచ్ దూరంలో నిలిచిపోయింది.. ఇది ఇప్పుడు పెద్ద సమస్య అయి కూర్చుంది. థియేటర్ కు, ఓటిటికి మధ్య కనీసం 8 వారాల గడువుండాలని నిర్మాతల మండలి గతంలో సూచించింది.. కానీ పరిస్థితి చూస్తుంటే ఆచరణలో అది జరిగే ఛాయలు కనిపించడం లేదు. దీపావళి సందర్భంగా గత నెల 21న విడుదలైన ఓరి దేవుడా ఇటీవల ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.. విశ్వక్సేన్ నటించిన ఈ తమిళ రీమేక్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రెస్పాన్స్ దక్కించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు.. యావరేజ్ ఫలితంతో ఆగిపోయింది. మొదటివారం కలెక్షన్లు బాగానే వచ్చాయి. రెండో వారం నెమ్మదించింది. ఇక మూడవారం ఫుల్ రన్ కష్టం స్థాయికి పడిపోయింది.. దీంతో స్మార్ట్ స్క్రీన్ పై ప్రత్యక్షమైంది.

స్వాతి ముత్యానిది అదే దారి
గత నెల సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి స్వాతిముత్యం అనే సినిమా విడుదలైంది. బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు డెబ్యూ హీరోగా నటించిన చిత్రం ఇది. కానీ విడుదలయిన 20 రోజులకే చిన్నితరపై ప్రత్యక్షమైంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.. కానీ దాన్ని వసూళ్ళుగా మార్చుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు దీనికి ఓరి దేవుడా సినిమా కూడా తోడైంది.. అసలు ఎలాంటి ప్రకటన, ప్రమోషన్లు పెద్దగా చేయకుండా ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వాస్తవానికి ఆహా లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 శుక్రవారం ఎపిసోడ్ స్ట్రీమ్ కాలేదు. ఆ ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఓరి దేవుడా సినిమాను స్ట్రీమ్ చేయడం ప్రారంభించారు. పివిపి లాంటి పెద్ద బ్యానర్ నిర్మించిన ఈ ఎంటర్టైనర్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన ఓటీటీ లోనే రావడం గమనార్హం.
నెల కూడా ఆగలేరా
వాస్తవానికి సినిమా పరిశ్రమ బతకాలంటే థియేటర్లు మనగడలో ఉండాలి.. ఆ థియేటర్లు మనుగడలో ఉండటం వల్లే ఇవాళ ఇంతమందికి సినీ పరిశ్రమ అన్నం పెడుతోంది. కానీ ఆ పరిశ్రమను కాపాడుకోవాలనే సోయి ఏ ఒక్కరిలో కనిపించడం లేదు. థియేటర్లను కోలన్న ఉద్దేశంతో 8 వారాల గడువు విధించుకున్న నిర్మాతల మండలి దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. కనీసం నెలరోజులు కూడా ఆపడం కష్టంగానే ఉంది.. ఎందుకంటే అగ్రిమెంట్ సమయంలోనే ఓటీటీ సంస్థలు ఎక్కువ ధర కావాలంటే స్పష్టంగా ఫలానా సమయంలోనే విడుదల చేస్తామని ముందే తేల్చి చెబుతున్నాయి. అలాంటప్పుడు ఏ ప్రయోజనం లేని మునుపటి నిర్ణయాలకు కట్టుబడి ఉండటం జరిగే పని కాదు. అయినా ఆగస్టు తర్వాత ఒప్పందం చేసుకున్న వాటికి ఇది వర్తిస్తుందని నిర్మాతల మండలి చెప్పింది. కానీ అలాంటివి ఆశించకపోవడం ఉత్తమం.

బాలీవుడ్ లో ఇలా లేదు
ఇక దేశంలో అత్యధికంగా సినిమాలు తీసే బాలీవుడ్ పరిశ్రమలో పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉంది. థియేటర్లను బతికించుకోవాలనే ఉద్దేశంతో అక్కడి నిర్మాతలు సినిమాలు విడుదలైన 50 నుంచి 80 రోజుల దాకా గ్యాప్ తీసుకుంటున్నారు.. ఆ తర్వాతే ఓటిటిలో స్ట్రీమ్ చేస్తున్నారు.. బాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్య సినిమాలు ఏవీ అంత విజయవంతం కావడం లేదు. అయినప్పటికీ అక్కడి పరిశ్రమ పెద్దలు తొందరపడటం లేదు.. పెద్దపెద్ద ఓటీటీ సంస్థలు మంచి ధరను ఆఫర్ చేస్తున్నప్పటికీ కానీ నిర్మాతలు తలొగ్గడం లేదు.. ఇక కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఒక్క టాలీవుడ్ లో తప్ప.