Rajamouli- Steven Spielberg: అన్నీ మంచి శకునములే అన్నట్లు దర్శకుడు రాజమౌళి టైం మాములుగా లేదు. గోల్డెన్ గ్లోబ్ గెలుచుకోవడం ద్వారా ఆయన పేరు ఇండియా వైడ్ మరోసారి మారుమ్రోగింది. రాజమౌళి కెరీర్లో బెస్ట్ పీరియడ్ నడుస్తుంది. ఆయనకు అంతర్జాతీయ గౌరవం దక్కుతుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు రాజమౌళి అందుకున్నారు. ఇక నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి ఎంపికైంది. ఈ అపూర్వ విజయాన్ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. చివరికి దేశ ప్రధాని మోడీ ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి అభినందనలు తెలిపారు.

ఇక ఆస్కార్ గెలవడమే లక్ష్యంగా ఆర్ ఆర్ ఆర్ ముందుకు వెళుతుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ షార్ట్ లిస్ట్స్ చోటు సంపాదించింది. జనవరి 12 నుండి 17 వరకు షార్ట్ లిస్ట్ లో ఉన్న చిత్రాలపై ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రతి విభాగం నుండి షార్ట్ లిస్ట్ అయిన చిత్రాల నుండి ఐదు చిత్రాలు ఫైనల్స్ కి నామినేట్ అవుతాయి. వాటిలో ఒకటి అవార్డు విన్నర్ అవుతుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్… నామినేషన్స్ లో చోటు దక్కించుకోవడంతో పాటు ఆస్కార్ కూడా గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈవెంట్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ లాస్ ఏంజెల్స్ వెళ్లిన విషయం తెలిసిందే. రాజమౌళి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా గాడ్ ఆఫ్ సినిమాగా భావించే స్టీవెన్ స్పీల్బర్గ్ ని కలిసే అరుదైన అవకాశం రాజమౌళికి దక్కింది. స్పీల్బర్గ్, రాజమౌళి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. రాజమౌళి పక్కన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఉన్నారు. ఆయన నాటు నాటు సాంగ్ బాగుందని చెప్పినట్లు సమాచారం. స్పీల్బర్గ్ తో ముచ్చటించిన ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేసిన రాజమౌళి ”నేను భగవంతుణ్ణి కలిశాను” అంటూ కామెంట్ పెట్టారు.

స్పీల్బర్గ్ సైతం గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ మోషన్ పిక్చర్ విభాగంలో ది ఫాబెల్మాన్స్ చిత్రానికి ఆయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. కెరీర్లో ఎన్నో అద్భుత సినిమాలు ప్రపంచానికి అందించిన స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్ సిరీస్ తో మరింత పాపులారిటీ సంపాదించారు. ఆయన్ని కలవడం గొప్ప అనుభూతిగా రాజమౌళి అభివర్ణించారు. నెక్స్ట్ రాజమౌళి హీరో మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. కొద్ది నెలల్లో మహేష్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw
— rajamouli ss (@ssrajamouli) January 14, 2023