Homeఎంటర్టైన్మెంట్Sankranti Movies 2023: అసలు సినిమాకు ఏది వరం.. ఏది శాపం

Sankranti Movies 2023: అసలు సినిమాకు ఏది వరం.. ఏది శాపం

Sankranti Movies 2023: ఆ మధ్య పఠాన్ సినిమాలో “బేషరమ్” అని ఒక పాట విడుదలైంది కదా! అందులో దీపికా పదుకొనే రెండు గుడ్డ పీలికలు ఒంటికి కట్టుకొని నర్తించింది. దేశం మొత్తం కాండ్రించి ఉమ్మింది.. వెంటనే ఓ సెక్షన్ ఒంటి కాలిపై లేచింది.. ఇప్పటికీ ఆ పాట మీద వివాదం నడుస్తూనే ఉంది.. అయితే ఇటీవల ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది.. బాంబుల మోత తప్ప ఇందులో పెద్దగా విషయం ఏమీ కనిపించలేదు..

Sankranti Movies 2023
amitabh bachchan unchai

కానీ అదే బాలీవుడ్ నుంచి “ఊంచాయ్” అనే ఒక సినిమా వచ్చింది.. వయస్సు దాచుకోకుండా, ఆవయసు వాళ్లకు కొత్త ఉత్సాహాన్నిస్తూ, బతుకు మీద ఆశల్ని పెంచుతూ, ఆశావహ దృక్పథాన్ని పంచుతూ ఓ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, డేనీ, వీరికి తోడుగా వెటరన్ తారలు… ఒక్కో దృశ్యం…ఒక్కో కావ్యం.. సినిమా రిలీజ్ సమయంలో పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.. అయితేనేం… 50 రోజుల్లో…50 కోట్లు వసూలు చేసింది. ఈ రోజుల్లో అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. కానీ ఆ పాత్రల ఔచిత్యానికి, ఔన్నత్యానికి మనమేం విలువ కట్టగలం?

 

80 సంవత్సరాల అమితాబచ్చన్ గళ్ళ లుంగీలు కట్టి స్టెప్పులు వేయడం లేదు.. కత్తి పట్టి నరకడం లేదు.. స్క్రీన్ నిండా రక్తం పారించడం లేదు..సేమ్, మమ్ముట్టి,మోహన్ లాల్ కూడా తమ వయసుకు తగినట్టు భిన్నమైన పాత్రలు ఎంచుకొని, ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు.. అభిమానుల కు గర్వకారణం అవుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ సంగతి వదిలేస్తే… ఎక్కడిదాకో ఎందుకు మన వెంకటేష్ కూడా భిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నాడు.. ఒక నారప్ప, ఒక దృశ్యం… మన స్టారాధిస్టార్లు మలయాళం లో హిట్ అయిన మంచి పాత్రల్ని కూడా నానా బీభత్సం చేస్తున్నారు.. అదే దృశ్యం సినిమా వీళ్ళ చేతుల్లో పడలేదు నయం. ఇంకా ఇమేజ్ బిల్డప్ లు, ప్రేక్షకుడు ఏదో తక్కువ ఇచ్చినట్టు డబ్బుల వేట.. స్టెప్పులు, ఫైట్లు, పంచులు, ఐటమ్ సాంగులు, చీప్ స్పూ ఫ్ లు..

Sankranti Movies 2023
shahrukh khan

ఒక అజిత్, ఒక విజయ్ ఏవో వేషాలు వేశారంటే, చల్ వాళ్లకు ఇంకా భోజనం అంత వయసు ఉంది, కెరీర్ ఉంది అనుకోవచ్చు.. కానీ ఇదే సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య? యువ వీర సింహారెడ్డి ముఖంలో కుర్రతనాన్ని అద్దేందుకు పాపం మేకప్ మెన్ నానా కష్టాలు పడ్డాడు.. మాస్ పేరిట వీరయ్య కు ఆ గళ్ళ లుంగీలు, పూల చొక్కాలు, నోట్లో బీడీ…ఓహో సగటు మత్స్యకారుడు అలా ఉంటాడా? అలానే ఉంటారు అని దర్శకుల బీభత్సమైన నమ్మకమా? బాలయ్య, చిరంజీవి ఒకరు ప్రజా జీవితంలో ఉంటే… ఇంకొకరు ప్రజా జీవితం నుంచి విరమించుకున్నారు.. ఒక పాత్ర పోషిస్తే ఎంత హుందాగా ఉండాలి?. అదేమీ లేదు. సరి కదా, అవే ఐటెం సాంగ్స్ కూడా… కోర్టు హాల్లో విలన్ తల నరకడాన్ని చిరంజీవి ఎలా సమర్థించుకుంటాడు? తోడుగా ఉన్న రవితేజ తెలంగాణ భాషను ఖూనీ చేస్తుంటే దాన్ని ఎలా సమర్థించగలరు? ఇక బాలకృష్ణ చేతుల కత్తి ఉంటే చాలు వందల మందిని కుర్చీ నుంచి లేవకుండా చంపేయగలడు.. అప్పట్లో ముసలి హీరోలను చూసి విసుగెత్తి యంగ్ చిరంజీవి, సుమన్, అర్జున్ వంటి వాళ్లను అభిమానులు ఓన్ చేసుకున్నారు.. మరి ఇప్పుడు?

సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు దిగాయి.. అందులో మెయిన్ ఫైట్ చిరంజీవి, బాలయ్య మధ్యే. అజిత్, విజయ్ లకు మన దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. తమిళంలో కూడా సరిగా ఆడకపోతే వారితో సినిమాలు తీసిన వాడి చేతులు, మూతులు కాలిపోయినట్టే.. కాకపోతే పోటీగా ఏ సినిమా లేకుండా చూసి, వందల థియేటర్లలో రిలీజ్ చేసి, ఎక్కువ రేట్లతో కలెక్షన్లు కుమ్మేసుకొని, అదీ మా ఘనతే అని చెప్పుకోవడం… ఈ కంటెంట్ రాసే సమయానికి వారసుడు 70 కోట్లు, తెగింపు 60 కోట్లు వసూలు చేశాయట.. ఈ లెక్కన వీరయ్య, వీరసింహుడు ఈజీగా వందల కోట్ల క్లబ్లో చేరిపోతారు.

Sankranti Movies 2023
waltair veerayya- veera simha reddy

మొదట్లో దృశ్యం _2 గురించి ఎందుకు చెప్పు కోవాల్సి వస్తోందంటే… అందులో పిచ్చి ఫైటింగ్ లు లేవు. తిక్క డ్యాన్సులు లేవు.. ఇమేజ్ బిల్డప్పులు లేవు.. ఐటమ్ సాంగ్స్, చీప్ జోక్స్ గట్రా ఏమీ లేవు.. అయినప్పటికీ 350 కోట్లు వసూలు చేసింది.. 350 కోట్లు అంటే మామూలు విషయమా? అదీ కదా హిట్ సినిమా అంటే.. కేవలం కథ, కథనాలే హీరోలు, సంకల్పం బాగుంటే, సినిమా పట్ల గౌరవం ఉంటే, ప్రేక్షకుడి పట్ల బాధ్యత ఉంటే కలెక్షన్లు అవే వస్తాయని చెప్పేందుకు దృశ్యం_2 ఒక ఉదాహరణ.. అసలే విజయాలు లేక వెలవెలబోతున్న బాలీవుడ్ కు సినిమా మళ్లీ ఊపిరి పోసింది.. సౌత్ నుంచి మొదలైన పాన్ ఇండియా ముప్పేట దాడిలో ముచ్చెమటలు పట్టిన హిందీ సినిమాకు ప్రాణం తీసుకొచ్చింది.. సో కాల్డ్ వింటేజీ డొల్ల, ఇమేజ్, ఫార్ములా అనేవీ డొల్లే. ఈ దరిద్రం నుంచి తెలుగు సినిమా ఎప్పుడు బయట పడుతుందో… ప్రేక్షకుడికి మంచి సినిమా అనుభూతి ఎప్పుడు ఇస్తుందో?!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular