Marital Torture: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది. వివాహ బంధంలో ఇద్దరిది సమ ప్రాధాన్యం ఉన్న పాత్రలే. కానీ నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య సఖ్యత కానరావడం లేదు. ఫలితంగా విడాకులు తీసుకుంటున్న జంటలే ఎక్కువగా ఉంటున్నాయి. పాశ్చాత్య దేశాలు మన సంప్రదాయాన్ని గౌరవిస్తుంటే మనం మాత్రం వారిని అనుసరిస్తున్నాం. ఫలితంగా విడిపోతున్న జంటలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల బంధం కాస్త విడాకుల సంబంధంగా మారుతోంది.

మనం చాలా సినిమాల్లో చూశాం. భర్తా బాధితులుగా భార్యలు ఉండటం తెలిసిందే. కానీ వీటికి విరుద్ధంగా భార్యాబాధితులు కూడా ఉండటం ఎప్పుడైనా చూశారా? నిజమే భార్యా బాధితులు కూడా ఉన్నారు. వారు పెట్టే బాధలు తాళలేక ఇబ్బందులు పడే భర్తలు కూడా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా జంబలకిడిపంబ టైపులో అంతా రివర్స్ లో ఉండటంతో భర్తలు తమ బాధలు చెప్పుకునేందుకు దేవుడినే ఎంచుకున్నారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. భార్యా బాధితులందరు కలిసి దేవాలయానికి వెళ్లి మాకు ఈ పెళ్లాలు వద్దంటూ పూజలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం వట సావిత్రి పూర్ణిమ. ఈ రోజు భార్యలు తమకు భర్తే ఏడు జన్మలకు భర్తగా రావాలని పూజలు చేయడం ఆనవాయితీ. కానీ దానికి విరుద్ధంగా భర్తలు ఈ భార్యలు మాకొద్దంటూ పూజలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో వారు ఎంతటి వేదనకు గురయ్యారో అర్థమవుతోంది. మాకు ఈ భార్యలు శత్రువుల్లా మారారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్యా బాధితులు పడే బాధలు చూడలేక దేవుడితో చెప్పుకుని తమ ఆవేశం తగ్గించుకున్నారు. పెళ్లాలతో పడుతున్న బాధలకు చెక్ పెట్టే సమయం రాదా అని వేడుకున్నారు. అయినా భార్యల బారి నుంచి తమను రక్షించుకోవాలని ప్రాధేయపడటం విచిత్రమే. దీంతో భార్యా బాధితుల సంఘం తరఫున వారు చేస్తున్న పోరాటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈక్రమంలో భార్యా బాధితుల బాధలు చెప్పనలవి కాదని తెలుస్తోంది. మొత్తానికి వట సావిత్రి పూర్ణిమ రోజు భర్తలు ఇలా చేయడం సంచలనం సృష్టించింది.