Chief Minister Tears After Watching The Movie: కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులు. ఇంట్లో ప్రేమగా పెంచుకునే పెట్ డాగ్స్ కుటుంబంలో సభ్యుల మాదిరి కలిసిపోతాయి. ఒక్కరోజు ఆ పెట్ డాగ్ కనిపించకుంటే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లల వలె చుట్టూ తిరుగుతూ ప్రేమ కురిపించే పెట్ డాగ్స్ యజమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటాయి. ఏళ్ల తరబడి మనతో పాటు జీవించిన పెట్ డాగ్ మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. లేటెస్ట్ రిలీజ్ 777 చార్లీ మూవీ చూసిన సీఎం కన్నీటి పర్యంతం కావడం హాట్ టాపిక్ గా మారింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ చిత్రం చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు ఆపుకోలేకపోయారు. ఆ సినిమా చూసి బసవరాజు బొమ్మై గతంలో మరణించిన తన పెట్ డాగ్ ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. సీఎం బసవరాజు ఇంట్లో చాలా కాలంగా ఓ పెట్ డాగ్ ఉండేది. దానితో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో ఆ డాగ్ చనిపోవడంతో సీఎం బసవరాజు చాలా కృంగిపోయారట. 777 చార్లీ సినిమా చూశాక తనకు దూరమైన పెట్ డాగ్ ని తలచుకొని ఆయన ఏడ్చారు.

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా 777 చార్లీ తెరకెక్కింది. చార్లీ అనే డాగ్ ఓ మనిషి జీవితాన్ని ఎలా మార్చింది అనేది ఆ సినిమా కథ. జూన్ 10న కన్నడ, తెలుగు భాషల్లో 777 చార్లీ విడుదల చేశారు. దర్శకుడు కిరణ్ రాజ్ కే తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. కన్నడలో 777 చార్లీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. ఈ ప్రయోగాత్మక చిత్రం ముఖ్యంగా పెట్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది.

ఇక మూగజీవాలను అమితంగా ప్రేమించే యాంకర్ రష్మీ… 777 చార్లీ మూవీ అందరూ చూడాలంటూ పిలుపునిచ్చారు. మూగజీవాల ప్రాముఖ్యత, వాటి ప్రేమను తెలియజేసే ఈ మూవీని అందరూ ఆదరించాలని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. రష్మీ చాలా కాలంగా మూగజీవాల సంక్షేమం కోసం పోరాడుతున్నారు. వాటిని హింసించకుండా ప్రేమించాలంటూ అవగాహన కల్పిస్తున్నారు.