
2024 Election- Jagan: రాబోయేది వైసీపీకి గడ్డు కాలమే అని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ వైసీపీ అగ్రనాయకత్వం గెలుపు సునాయాసమని నమ్ముతోంది. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉన్నామని సర్దిచెప్పుకుంటోంది. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ఢంకా బజాయించి చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలుస్తామో స్పష్టతతో ఉంది. ఇంతకీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది ? ఆ పార్టీ అధినాయకత్వం నమ్మకమేంటి ? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వైసీపీ ఇన్నాళ్లు వైనాట్ 175 అంటూ వచ్చింది. కానీ ఇప్పుడు లెక్క తగ్గించింది. కానీ గెలుపు మాత్రం ఖాయమని చెబుతోంది. ఇటీవల పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారమని జగన్ తేల్చాడు. 2019లో 151 సీట్లు వచ్చాయి. ఈసారి కనీసం ఒక్కటైనా ఎక్కువ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంటే 2024లో 152 సీట్లు సాధించాలనేది జగన్ లక్ష్యం. కనీసం 56 నుంచి 57 శాతం ఓట్లు వైసీపీకి పడతాయనేది జగన్ అంచనా.
మూడు, నాలుగు సర్వే సంస్థలతో జగన్ సర్వేలు చేయించుకుంటున్నాడు. ఒకదానితో ఇంకొకటి సరిపోల్చుకుంటున్నాడు. ఈ సర్వేల సారాంశం మేరకు జగన్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నప్పటికీ .. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే స్థితిలో ప్రతిపక్షాలు లేవనేది జగన్ నమ్మకం. అందుకే వచ్చే ఎన్నికల్లో 130 నుంచి 140 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామని నమ్ముతున్నారు. ఇంకొంచెం కష్టపడితే 152 సీట్లు సాధించొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు తమ దరిదాపుల్లో లేవనే ధృఢ నిశ్చయంతో పార్టీ నేతలకు గెలుపు పై అభయమిచ్చారట.

జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే ప్రభావం ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు. అక్కడ అదే సామాజికవర్గ నేతలను బరిలో దింపే ఆలోచనలో ఉన్నారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు త్యాగం చేయాల్సి వస్తుందని ఇప్పటికే సూచించారు. రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు, కోస్తాలో 40 నుంచి 60 సీట్లు, ఉత్తరాంధ్రలో 30 నుంచి 40 సీట్లు సాధిస్తుందనే అంచనాతో జగన్ ఉన్నారు. తెలుగుదేశం 25 నుంచి 35 స్థానాలతో సరిపెట్టుకుంటుందని జగన్ నమ్ముతున్నారు. ఇక జనసేనకు 0 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందట.
వచ్చే ఎన్నికల పై ఇంత క్లారిటీతో ఉన్న జగన్.. జనసేన, టీడీపీ పొత్తు గురించి అంత బాధ ఎందుకు అనేది ప్రతిపక్షాల ప్రశ్న. వారాహి ఏపీలో తిరగనియ్యం అంటారు. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. కానీ గెలుపు తమదే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గెలుపు పై అంత స్పష్టత ఉన్నప్పుడు ప్రతిపక్షాలను అణచివేయాలని ప్రయత్నించడం ఎందుకు అన్న ప్రశ్నరాక మానదు. గెలుపు పై అంత స్పష్టత ఉన్న జగన్ రెడ్డే దీనికి సమాధానం చెప్పాలి.