Sankranti Movies 2023- Chiranjeevi And Balakrishna:: సంక్రాంతి విడుదలకు మూడు చిత్రాలు సిద్ధమయ్యాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు 2023 జనవరిలో విడుదల అవుతున్నాయి. వీరసింహారెడ్డి నిర్మాతలు విడుదల తేదీ కూడా ప్రకటించారు. 12న వీరసింహారెడ్డి వరల్డ్ వైడ్ విడుదల అవుతుంది. ఇక బాలయ్య కంటే ముందు లేదా వెనుక చిరంజీవి, విజయ్ చిత్రాల విడుదల ఉంది. సంక్రాంతికి మూడు నాలుగు పెద్ద చిత్రాలు విడుదలైనా పర్లేదు. టాక్ బాగుంటే అన్ని చిత్రాలకు ఆదరణ దక్కుతుంది. ఇంటిల్లపాది సంక్రాంతికి థియేటర్స్ లో సినిమా చూడటం పండగలో భాగంగా ఉంది.

మూడు పెద్ద చిత్రాలు రోజుల వ్యవధిలో విడుదల కావడం అనేది సమస్యే కాదు. థియేటర్స్ లభ్యతే అసలు సమస్య. 2020లో అల్లు అర్జున్-మహేష్ మధ్య పెద్ద రచ్చ జరిగింది. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో విడుదల తేదీలుగా ప్రకటించారు. అయితే ఎవరికి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలనే విషయంలో వివాదం తలెత్తింది. రేపు విడుదల అనగా.. ఇవాళ కూడా పంచాయితీ తెగలేదు. ఎట్టకేలకు 10వ తేదీ సాయంత్రం దిల్ రాజు నేతృత్వంలో ఇరు చిత్రాల నిర్మాతలు కూర్చొని ఒక అవగాహనకు వచ్చారు.
2021లో కూడా వివాదం ఏర్పడింది. దిల్ రాజు డబ్బింగ్ సినిమా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న నేపథ్యంలో హిట్ మూవీ క్రాక్ ని తొక్కేశాడని వరంగల్ శ్రీను ఆరోపణలు చేశారు. 2022లో అన్నీ చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. బంగార్రాజు మినహాయిస్తే పెద్ద చిత్రాలేవీ లేవు. దీంతో ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఈ సంక్రాంతికి భారీ వివాదం నెలకొంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న వారసుడు చిత్రం డబ్బింగ్ మూవీ అంటూ, విడుదల ఆపాలని తెలుగు సినిమా నిర్మాతల మండలి ట్రై చేసింది. అయితే అది జరగని పని. దిల్ రాజు తన పంతం నెగ్గించుకున్నాడు. వారసుడు సంక్రాంతికి విడుదల అవుతుంది.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల నిర్మాతలు ఒక్కరే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. కొత్తగా వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెట్టారు. ఆఫీస్ తెరిచారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్స్ వారసుడికే కేటాయించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఉత్తరాంధ్రలో యాభై శాతం థియేటర్స్ వారసుడు చిత్రానికి ఒక ముప్పై శాతం వాల్తేరు వీరయ్యకు, ఇరవై శాతం వీరసింహారెడ్డికి కేటాయించారట. అక్కడ దిల్ రాజుకు 37 థియేటర్స్ ఉన్నట్లు సమాచారం.
కొన్నాళ్లుగా ఆ నలుగురు అనబడే దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ థియేటర్స్ అధీనంలో పెట్టుకొని పరిశ్రమను కంట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కూడా వాళ్ళ ముందు నిస్సహాయులే, వాళ్ళను కాదని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ దిల్ రాజు చేయాల్సింది చేసేశాడు. వీలైనంత వరకు తమ చిత్రాలకు థియేటర్స్ దక్కించుకోవడానికి చిరంజీవి, బాలయ్య ట్రై చేయాలి. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య… సురేష్ బాబు, అల్లు అరవింద్ లను నా సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారని అడిగాడు. అక్కడ బాలయ్య చేసింది డిమాండ్ కాదు, రిక్వెస్ట్. అది ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితి.