
TSPSC Paper Leak Issue: పేపర్ లీకయింది. నిందితులు జైల్లో ఉన్నారు. కేటీఆర్ ప్రెస్ మీట్లలో అరుస్తున్నారు. ఇన్నాళ్లూ చదివిన అభ్యర్థులు, త్వరలో అఫీసర్లమవుతామంటూ కలలు కన్న నిరుద్యోగులు కన్నీరు కారుస్తున్నారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఈ దారుణానికి ఎవరు బాధ్యులు? ఈ వేదనకు ఎవరు కారకులు? ఏం చేస్తే ఈ బాధ తగ్గుతుంది? ఏ లేపనం పూస్తే ఈ మంట చల్లారుతుంది? అటు లీక్ చేసిన వాడు, ఇటు అమ్ముకున్న వారు, మధ్యలో లాభపడ్డవారు.. అందరూ బాగానే ఉన్నారు. నడిమిట్ల అభ్యర్థులే అడకత్తెరలో పోక చెక్కలయ్యారు.
కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తే
ఇప్పుడు కాకపోతే మరెప్పుడు. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తే గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి కొలువు కొట్టాల్సిందే. ఎంత కష్టమైనా భరించాల్సిందే. ప్రైవేటు కొలువు వదిలేస్తే మళ్లీ సంపాదించుకోవచ్చు. కోచింగ్ కోసం అప్పులు చేస్తే.. తల తాకట్టు పెట్టయినా తిరిగి తీర్చేయొచ్చు. పచ్చడి మెతుకులు తిన్నా పర్లేదు.. పూట గడిస్తే చాలు. ఆరునూరైనా పుస్తకాలన్నీ చదవాలి. జాబ్ కొట్టేదాకా ముఖం చూపించననే వాగ్దానాన్ని నిరూపించుకోవాలి. గ్రూప్-1 కోసం అన్నీ వదిలేసి.. కేవలం ఉద్యోగమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమవుతున్న అనేక మంది యువత నేపథ్యం ఇదే. అయితే పేపర్ లీక్‌తో వాళ్ల ఆశలు అడియాసలయ్యాయి. ఇన్నాళ్లూ నోటిఫికేషన్లు లేవని బాధపడిన అభ్యర్థులు.. ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. అప్పులు చేసి చదువుకుంటున్న వారు మరింత కుంగిపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసిన వారు ఆందోళనలో ఉన్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారికి బాధలో మాములుగాలేవు. స్థూలంగా చెప్పాలంటే పేపర్ లీక్‌తో గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు ఆత్మస్థైర్యం కోల్పోయారు.
దారుణాతీదారుణం
గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లోలో రెండు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు గ్రూప్-1 మెయిన్స్‌తోపాటు గ్రూప్-2 కోసం వేర్వేరుగా శిక్షణ పొందుతున్నారు. ఈ రెండు కోర్సులకు వారు రూ. 51 వేలు ఫీజు చెల్లించారు. హాస్టల్‌కు ప్రతినెలా రూ.10 వేల చొప్పున రెండు నెలలకు రూ.20 వేలు, పుస్తకాలకు రూ.7 వేలు.. ఇలా గ్రూప్-1 మెయిన్స్ కోసం ఇప్పటి దాకా వారు చేసిన ఖర్చు రూ.78 వేలు. పేపర్ లీకై గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయడంతో.. కోచింగ్ సెంటర్‌లో శిక్షణను నిలిపేశారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధమవుతూ భవిష్యత్తు గురించి ఎన్నో కలలుకన్న వారు.. తాజా పరిణామాలతో తీవ్ర మనోవేదనతో కుంగిపోతున్నారు వారు మాత్రమే కాదు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుతో ఆవేదన చెందుతున్నవారి సంఖ్య రాష్ట్రంలో వేలల్లో ఉంది. పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన అశోక్‌నగర్‌లో రూ.లక్షలు ఖర్చు చేసి శిక్షణ పొందుతున్న వారి వేదన దారుణాతీదారుణం.

అశోక్‌నగర్‌లో శిక్షణ
ఒకేసారి 503 పోస్టులు ఉండటంతో ఈసారి ప్రకటించిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపికచేయడంతో.. ఈసారి అనేకమంది పరీక్షకు సిద్ధం అవుతున్నారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు, ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు కొలువులను వీడి చదువుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారు దీర్ఘకాలిక సెలవు పెట్టి అశోక్‌నగర్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈసారి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో అశోక్‌నగర్‌లో ఎన్నడూ లేనంత రద్దీ కనిపిస్తోంది.

ఫ్లెక్సీలు మళ్లీ దర్శనమిస్తున్నాయి
కోచింగ్ సెంటర్లు గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం రూ.30-50వేల వరకు ఫీజులు వసూలు చేయగా.. మెయిన్స్ ఫీజు మరింత పెంచాయి. మెయిన్స్‌కు ఎంపికైన వారి ఫలితాలు జనవరిలో ప్రకటించడమే ఆలస్యం.. లాంగ్ టర్మ్, క్రాష్ కోర్సులు, ఆన్‌లైన్ తరగతులు అంటూ.. మూడు నెలలుగా హడావిడి కొనసాగుతోంది. ప్రిలిమ్స్‌ను ఆషామాషీగా తీసుకుని స్వల్ప మార్కులతో అర్హత సాధించిన వారు మెయిన్స్‌పై సీరియస్‌గా దృష్టి సారించారు. ఒక్కో అభ్యర్థి మెయిన్స్ కోసం సరాసరి రూ.50వేల వరకు ఖర్చు చేశారు. ప్రిలిమ్స్ రద్దుతో అనేక సెంటర్లు ఇప్పటికే మెయిన్స్ కోచింగ్ తరగతులను రద్దు చేశాయి. కోచింగ్ సెంటర్లన్నీ మొత్తం ఫీజు ఒకేసారి వసూలు చేసినందున.. ఫీజు తిరిగి చెల్లించే పరిస్థితి లేదని అభ్యర్థులు అంటున్నారు. మరోవైపు ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహిస్తామని టీఎ్‌సపీఎస్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అశోక్‌నగర్‌లో క్రాష్ కోర్సులకు సంబంధించిన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.