
Bandi Sanjay: తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ కార్యాలయం నుంచి లీక్ అయిన వివిధ ప్రశ్న పత్రాలకు సంబంధించిన రగడ ఇప్పట్లో చల్లారే పరిస్థితి కన్పించడంలేదు. ప్రభుత్వం దీనిపై సిట్ తో దర్యాప్తు చేయిస్తునప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్మిస్తూనే ఉన్నాయి. ఐటీ మంత్రి కేటీఆర్ దీనిపై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన విషయాలను బయట పెట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన జడ్పీటీసీ, సర్పంచ్‌లు, సింగిల్ విండో చైర్మన్ల పిల్లలు క్వాలీఫై అయ్యారు. ఒకే మండలం నుంచి 60 మంది క్వాలిఫై అయ్యారు. మరీ దారుణమేంటంటే ఒక గ్రామం నుంచి ఆరుగురు పరీక్ష రాస్తే.. ఆరుగరూ క్వాలిఫై అయ్యారు. వీరంతా జగిత్యాల జిల్లాకు చెందిన వారు. వీరంతా కూడా భారత రాష్ట్ర సమితి నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పని చేసే వాళ్లే. నలుగురు సర్పంచ్‌ల కొడుకులు, సింగిల్ విండో చైర్మన్ కొడుకుతో పాటు, ఒక జడ్పీటీసీ వద్ద బాడీ గార్డ్‌గా పనిచేసే వ్యక్తి క్వాలీఫై అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యారు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హత సాధించే అవకాశం లేకపోయినప్పటికీ క్వాలిఫై చేశారు.

ఈ వ్యవహారం మొత్తంలో కేటీఆర్ వద్ద పనిచేస్తే ఒక కీలక వ్యక్తి అన్నీ తానై వ్యవహరించారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 5 నుంచి రూ. 8 లక్షల దాకా తీసుకున్నాడని సమాచారం. వీటికి సంబంధించిన మొత్తం సమాచారం ఉందని బండి సంజయ్ అంటున్నారు. అన్ని ఆధారాలతో కేటీఆర్‌ను దోషిగా నిలబెడతామని చెబుతున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పై బీజేపీ నియమించిన టాస్క్‌ఫోర్స్ బృందం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తోంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే కీలక వ్యక్తి ఈ జిల్లాకు చెందిన వాడే. కేటీఆర్ ప్రైవేట్ వ్యవహారాలు మొత్తం ఈ వ్యక్తే చూస్తాడు. పైగా అధికారిక సమావేశాల నుంచి అనధికారిక సమావేశాల దాకా అన్నీ తానై వ్యవహరిస్తాడు. కేటీఆర్ కూడా అతడినే బాగా నమ్ముతాడు. ఇక టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రోజుకో విషయం వెలుగు చూస్తుండటంతో సదరు వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.