
Telangana Politics: ఎన్నికలకు ఇంకా ఏడు నెలల కాలం ఉంది. అయినప్పటికీ తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉన్నట్టు రాజకీయం కొనసాగుతోంది.. ఏ ముగ్గురు ఒకచోట కలిసినా పేపర్ లీకేజీ గురించి చర్చ జరుగుతోంది. ఇక రాజకీయ పార్టీలు అయితే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో యుద్ధానికి దిగుతున్నాయి.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రం లీకయిన దగ్గర నుంచి తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీనికి తోడుగా టెన్త్ తెలుగు, హిందీ ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో రాజకీయ రంగు పులుముకుంది.. ప్రశ్న పత్రాలు లీకేజీ వ్యవహారంలో మంత్రులను భర్తరఫ్ చేయాలన్న డిమాండ్ తో మొదలైన రాజకీయం.. తాజాగా ప్రతిపక్ష నేత అరెస్టు వరకు వెళ్ళింది. అయితే వచ్చే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఎటువంటి మలుపులు తీసుకుంటుందో అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశం తెలంగాణలో రాజకీయంగా పెను దుమారం రేపింది. లక్షల మందికి సంబంధించిన అంశం కావడంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని లేదా ఆయన రాజీనామా చేయాలనే డిమాండును ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. మరో వైపు పేపర్ లీకేజీ పై రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించారు. ఇక ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసు పై దర్యాప్తు చేపట్టింది. అది కూడా చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ కేసులో చాలా మందిని సీట్ అధికారులు అరెస్టు చేశారు.. కాంగ్రెస్ ఫిర్యాదుతో ఈడి కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శలయితే తారా స్థాయికి చేరుకుంటున్నాయి. రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ అంశం లో ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ పై దర్యాప్తు కొనసాగుతుండగానే.. పదో తరగతి ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని మరింత రేపింది. ప్రభుత్వంపై కూడా విపరీతమైన ఒత్తిడి పెరిగింది. పది పరీక్షలకు విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యమిస్తారు. అలాంటి పరీక్ష పేపర్లు లీక్ అవడంతో ప్రభుత్వం పై విమర్శల దాడి పెరిగింది. దీంతో ప్రభుత్వం వరంగల్ లో జరిగిన పది పేపర్ లీకేజీ అంశంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయవేడిని మరింత పెంచింది.
బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మరోవైపు అధికార పార్టీ నేతలు సైతం భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలకు దిగారు. అటు కమలం, ఇటు కారు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. దీంతో లీకేజీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నది. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలైన తర్వాత వరుసగా పేపర్లు లీక్ అవుతున్నాయి. మొదటిరోజు తెలుగు, రెండవ రోజు హిందీ పేపర్లు లీక్ అయ్యాయి. బుధ వారం సెలవు కావడంతో పరీక్ష నిర్వహించలేదు. గురువారం ఇంగ్లీష్ పరీక్ష మాత్రం ప్రశాంతంగా సాగింది. ఇక ఈ పరిణామాలతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది పది పరీక్షలను ఆరు పేపర్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడు పేపర్లు పూర్తయిపోయాయి. ఇంకా మూడు పరీక్షలు జరగాల్సి ఉంది. 11 న పరీక్షలు ముగుస్తాయి. చివరి మూడు పరీక్షలకు సంబంధించి పేపర్లు లీక్ కాకుండా ఉండాలని అధికారులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం రెండింటి నుంచి ఒత్తిడి ఉంటుంది కాబట్టి.. అధికారులు మరింత అప్రమత్తతో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.