
Secunderabad Railway Station: కంపుకొట్టే మరుగుదొడ్లు, చెత్తతో నిండి ఉండే ప్లాట్ ఫామ్ లు ఇక ఉండవు. రద్దీతో కిక్కిరిసిపోయే విశ్రాంతి భవనాలు ఇక కనిపించవు. కళావిహీనంగా కనిపించే రైల్వే స్టేషన్ ధవళ కాంతులతో మెరుస్తుంది. అంతే కాదు వచ్చింది రైల్వే స్టేషన్ కా, ఎయిర్ పోర్ట్ కా అనే భ్రమ మనలో కలుగుతుంది ఎందుకంటే.
1874లో నిర్మితమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ స్టేషన్ ప్రాంగణాన్ని ఎయిర్ పోర్ట్ తరహాలో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విదేశాలలో ఉన్న రైల్వే స్టేషన్ల మాదిరిగా కళ్ళు చెదిరే సౌకర్యాలను ఈ రైల్వేస్టేషన్లో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం 715 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ రానున్నారు. కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువుగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 121 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. గరిష్టంగా రోజు 1.40 లక్షల మంది, పండగల సమయంలో 1.80 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. తో ప్రాధాన్యం ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిన నేపథ్యంలో పునరాభివృద్ధి పథకం లో భాగంగా ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో పునర్నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. 2025 అక్టోబర్ లోగా ఈ పనులు మొత్తం పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ముందుకు సాగుతోంది.

పునరాభివృద్ధి పథకం ద్వారా ఉత్తరం వైపున 22, 156 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు అంతస్తులో కొత్త స్టేషన్ భవనం నిర్మించనున్నారు. దక్షిణం వైపు ఉన్న భవనాన్ని జీ+ 3 అంతస్తులతో విస్తరించనున్నారు. 14,792 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల సౌకర్యార్థం మొదటి స్థాయిలో 108 మీటర్ల వెడల్పుతో రెండు అంతస్తుల స్కై కాన్కోర్స్, సాధారణ ప్రజల కోసం రెండవ స్థాయిలో రూఫ్ టాప్ ప్లాజా నిర్మించనున్నారు.. స్టేషన్ లో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థతోపాటు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్ కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. ఒక్కో ఫ్లాట్ ఫామ్ పై రెండు ఎస్క లేటర్లు, క్యాంటీన్ లు ఏర్పాటు చేయబోతున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆటో, కారు, బైకులు నేరుగా స్టేషన్ వద్దకు వచ్చి తిరిగి బయటకు వెళ్లేందుకు రూఫ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇంటర్ నెట్ సేవలు అందించేందుకు వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్లాట్ ఫామ్ _1 పై ఉన్న సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్, అర్ పీ ఎఫ్ స్టేషన్లకు కూడా కొత్త భవనాలు అందులోనే ఏర్పాటు చేయనున్నారు.