Bangalore: రైతంటే రిన్ సబ్బుతో ఉతికిన బట్టలు వేసుకుంటాడా? మెట్రో సిబ్బందికి బుద్ధి లేదా?

బెంగళూరు మన దేశానికి ఐటీ సిటీ. పెద్దపెద్ద ఆకాశహార్యాలతో బెంగళూరు నగరం మరో సిలికాన్ సిటీని తలపిస్తుంటుంది. అలాంటి బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు చాలా ఎక్కువ.

Written By: Suresh, Updated On : February 27, 2024 4:15 pm
Follow us on

Bangalore: మనం తాగే టీ, తినే టిఫిన్, మధ్యాహ్నం లాగించే భోజనం, సాయంత్రం ఆరగించే డిన్నర్.. ప్రతి ఒక్కటి రైతు చెమటతో ముడిపడి ఉన్నవే. అతడి పది వేళ్ళూ భూమిలో కష్టపడితేనే మన ఐదు వేళ్ళు లోపలికి వెళ్తాయి. లేకుంటే పస్తులు ఉండాల్సిందే. కానీ కొంతమందికి రైతు అంటే లెక్క ఉండదు. అన్ని ప్రకృతి విపత్తులు ఎదుర్కొని పంట పండిస్తున్నాడనే జాలి కూడా ఉండదు. అందువల్లే చాలామంది వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. పంట పొలాలను అమ్ముకొని నగరాలకు వలస వెళ్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ పొలాలు కొని అందులో వెంచర్లు నిర్మిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పీల్చే గాలి, తాగే నీరు తప్ప అన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇక కొంతమంది రైతులయితే వ్యవసాయం మీద మక్కువ చావక.. వ్యవసాయం తప్ప మరేం పని చేయాలో తెలియక.. కష్టమో, నష్టమో సాగునే నమ్ముకుని బతికేస్తున్నారు. అలాంటి రైతులకు సమాజంలో గౌరవం దక్కుతుందా అంటే? లేదనే చెప్పాలి. బెంగళూరులో జరిగిన ఓ సంఘటన ఇందుకు సజీవ తార్కాణంగా నిలుస్తోంది.

బెంగళూరు మన దేశానికి ఐటీ సిటీ. పెద్దపెద్ద ఆకాశహార్యాలతో బెంగళూరు నగరం మరో సిలికాన్ సిటీని తలపిస్తుంటుంది. అలాంటి బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు చాలా ఎక్కువ. అందుకే చాలామంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే మెట్రో రైలును ఆశ్రయిస్తారు. అలాంటి బెంగుళూరుకు ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రైతు పని మీద వచ్చాడు. నెత్తి మీద మూటలో ఏదో సరుకులు కట్టుకొని బయలుదేరాడు. తనకు తెలిసిన వారు ఉండే ప్రాంతానికి వెళ్లడానికి మెట్రో రైల్ ఎక్కడానికి టికెట్ తీసుకుని.. అందులోకి ప్రవేశిస్తుండగా.. మెట్రో సిబ్బంది అడ్డుకున్నారు. మెట్రో సిబ్బంది అడ్డుకోవడానికి అతడేం దొడ్డిదారిలో రాలేదు. టికెట్ లేకుండా స్టేషన్ లోకి ప్రవేశించలేదు. కానీ అతడు వేసుకున్న బట్టలు మురికిగా ఉన్నాయని కారణంతో మెట్రో సిబ్బంది అడ్డుకున్నారు.. ఆ రైతు ఎంత బతిమిలాడినప్పటికీ మెట్రో సిబ్బంది ఒప్పుకోలేదు.

పాపం బాధతో ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తున్న ఓ యువకుడు ఆ రైతు చెయ్యి పట్టుకొని మెట్రో సిబ్బంది వద్దకు తీసుకెళ్లాడు. అతడు వేసుకున్న బట్టలు మురికిగా ఉంటే మీకేంటి నష్టం? అతడు ఒక రైతు, అతడు పొద్దంతా పనిచేస్తాడు కాబట్టి బట్టలు మురికిగానే ఉంటాయి. మీలాగా సూట్లు బూట్లు వేసుకోవడానికి అతడేం స్థితిమంతుడు కాదంటూ మెట్రో సిబ్బంది నిలదీశాడు. ఆ రైతును బలవంతంగా మెట్రో రైలులో ఎక్కించాడు. ఆ మెట్రో సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ యువకుడు అలాగే ఆ రైతును రైల్లో ఎక్కించి పంపించాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కన్నడ మీడియాలో ప్రసారం కావడంతో బెంగళూరు మెట్రో యాజమాన్యం స్పందించింది.. ఆ రైతును రైలు ఎక్కకుండా అడ్డుకున్న సిబ్బందిని విధుల నుంచి తప్పించింది. కాగా ఆ రైతుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు బెంగళూరు మెట్రో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.