
AP BJP: ఇన్నాళ్లు ఆ పార్టీని వాడుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా వదిలేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఇంతలోనే తట్ట బుట్ట సర్దుకుంటున్నారు. పోతు.. పోతు నాయకత్వం పై పెదవి విరుస్తున్నారు. వారితో వేగలేం అంటూ నిట్టూర్పులు వెల్లగక్కుతున్నారు. అదును చూసి బయటికొస్తున్నారు. అవసరం తీరాక జారుకుంటున్నారు. ఇంతకీ ఆ పార్టీలో ఏం జరుగుతోంది ? జంప్ జిలానీలు ఇంకెంతమంది ? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్.
ఏపీ బీజేపీలో వింత పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు ఆహా.. ఓహో అంటూ పొగిడిన నేతలు ఇప్పుడు పార్టీ నుంచి బయటికెళ్తున్నారు. మూడున్నరేళ్లు పార్టీలో సర్దుకుపోయిన నేతలు.. తాజాగా ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ రాజీనామాతో కలకలం రేగింది. కన్నా అనుచరులు మూకుమ్మడిగా బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీలో ఇమడలేం అంటూ కన్నా వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు వైఖరితో విసిగిపోయినట్టు ప్రకటించారు. కన్నా లక్ష్మినారాయణ త్వరలో టీడీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.
కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేయడంతో కొత్త చర్చకు తెరలేసింది. ఎన్నికల ముందు ఓ వర్గం నేతలు ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అందులో చంద్రబాబు వర్గం ఒకటి ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు కన్నా రాజీనామాతో చంద్రబాబు వర్గం నేతలు బీజేపీని ఒక్కొక్కరుగా వదులుతున్నారన్న టాక్ నడుస్తోంది. కన్నా తర్వాత పురందేశ్వరి కూడా పార్టీ మారనుందా అన్న చర్చ జరుగుతోంది. గతంలో చంద్రబాబు కుటుంబానికి దూరంగా ఉన్న పురందేశ్వరి కుటుంబం.. ఇటీవల బాగా దగ్గరయింది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి కూడా టీడీపీ వైపు చూస్తున్నారా ? అన్న చర్చ లేకపోలేదు.

బీజేపీలో చంద్రబాబుకు బలమైన వర్గముందని ఇటీవల వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ విచారణ సందర్భంగా.. సీబీఐ అనుమానితుల్ని ఏం ప్రశ్నలు అడుగుతుందో ముందే చంద్రబాబుకు, ఆయన సంబంధిత మీడియాకు ముందే తెలుస్తున్నాయని సజ్జల వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణలో ఉన్న విషయాలో బీజేపీలోని చంద్రబాబు వర్గం ద్వారానే తెలుస్తున్నట్టు సజ్జల ఆరోపించారు. దీనిని బట్టి బీజేపీలో చంద్రబాబు వర్గం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ, టీడీపీ, జనసేనల పొత్తుకు కూడా బీజేపీలోని చంద్రబాబు వర్గం బలంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు వర్గ ప్రయత్నాలకు సోమువీర్రాజు టీం మోకాలొడ్డినట్టు సమాచారం. దీంతో పొత్తు పొడువకుండానే ముగిసిపోయింది.
టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్లే పరిస్థితి లేదని తేలిపోయింది. బీజేపీలో చంద్రబాబు వర్గం నేతలకు ఈ విషయం బోధపడినట్టు తెలుస్తోంది. ఒకవేశ మూడు పార్టీల పొత్తు కుదిరి ఉంటే. . చంద్రబాబు వర్గం నేతలకు అవకాశాలు దక్కేవి. ఇప్పుడు ఎలాంటి అవకాశం లేదు. అందుకే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్టు సమాచారం. కన్నా బాటలోనే మరికొంత మంది బీజేపీ నేతలు నడిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా అదును చూసి బీజేపీని వీడుతున్నట్టు కనిపిస్తోంది. మూడున్నరేళ్లు గడిచాక ఎన్నికల ముందు తెప్ప తిరగేస్తున్నట్టు అనిపిస్తోంది. బీజేపీలోని ఫిరాయింపుదారుల దారి చంద్రబాబు ఇంటికేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.