Gujarat Lawyer: 138 జంటల విడాకులు అడ్డుకున్నాడు: చివరికి ఆయనే ఒంటరయ్యాడు

భార్యాభర్తలను కలుపుతాడు అనే పేరు ఉన్న ఈ న్యాయవాదిపై ఆయన భార్య విడాకుల కోసం కేసు ఫైల్ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు కూడా చెప్పింది.

Written By: Rocky, Updated On : June 19, 2023 3:39 pm

Gujarat Lawyer

Follow us on

Gujarat Lawyer: శకునం చెప్పే బల్లి కుడితిలో పడడం అంటే ఇదే కాబోలు.. ఆయన ఓ న్యాయవాది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు దండిగా ఉన్నాయి. పైగా ఏ కేసునైనా గట్టిగా వాదిస్తారు, గెలిపిస్తారు అనే నమ్మకం కక్షిదారుల్లో ఉంటుంది. అందుకే ఆయనను ” కలిపే న్యాయవాది” అని పిలుస్తుంటారు..కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురయింది. పేరుకు పెద్ద లాయర్ అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన కుటుంబం చిన్నాభిన్నమైంది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

16 సంవత్సరాలుగా ప్రాక్టీస్

అహ్మదాబాద్ కోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఇతడికి బంధాలు, అనుబంధాలు అంటే చాలా ఇష్టం. కుటుంబాలు కలిసి ఉంటేనే దేశం బాగుంటుందని నమ్మే వ్యక్తి. అందుకే తన వద్దకు వచ్చే ఈ విడాకుల కేసులు కూడా విడిపోయేదాకా తీసుకురాలేదు. ఇలా 138 జంటలు విడాకుల కోసం తన వద్దకు రాగా.. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వారందరినీ కలిపాడు. వారి కుటుంబాల్లో సంతోషాన్ని, అన్యోన్యతను తిరిగి పాదుకొలిపాడు. అయితే ఇంతటి మంచి పేరు ఉన్న ఈ న్యాయవాది, భార్య భర్తలను విడాకులు తీసుకోకుండా కాపాడుతాడనే పేరు పొందిన ఈ న్యాయవాది చివరికి తనే విడాకులు తీసుకుంటాడని కనీసం కలలో కూడా ఊహించి ఉండడు.

విడాకుల కోసం భార్య కేసు ఫైల్

భార్యాభర్తలను కలుపుతాడు అనే పేరు ఉన్న ఈ న్యాయవాదిపై ఆయన భార్య విడాకుల కోసం కేసు ఫైల్ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు కూడా చెప్పింది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపదమే కాకుండా, వారి వద్ద నుంచి ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదని వాపోయింది. ఫీజులు తీసుకోకపోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల మా ఇద్దరికీ గొడవలు అవుతున్నాయని వివరించింది. ఆ గొడవల వల్ల న్యాయవాద దంపతులిద్దరూ విడిగా ఉంటున్నారు. భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఆమె కోర్టులో కేసు పెట్టింది. ఇక ఇద్దరికీ ఒక కూతురు ఉంది. తల్లిదండ్రుల మధ్య గొడవలో “లా” చదువుతున్న ఆ యువతి సైతం ఇబ్బందులకు గురవుతోంది. విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ యువతి తన తల్లితో నివసించింది. కోర్టు విడాకులు మంజూరు చేసిన తర్వాత ఆ యువతి తనకు తన తండ్రి రోల్ మోడల్ అని, ఆయనతోనే కలిసి ఉంటానని చెప్పింది. కోర్టు కూడా ఆమె నిర్ణయాన్ని అంగీకరించింది. తండ్రితో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. కాగా న్యాయవాది నుంచి ఆమె భార్య ఎలాంటి భరణం తీసుకోలేదని తెలుస్తోంది..

అందుకే ఫీజు తీసుకోలేదు

ఫీజు ఎందుకు తీసుకోలేదని అడిగితే.. ” నా కజిన్ విడాకులు తీసుకున్నాడు. అప్పటినుంచి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఏ జంట విడాకుల కోసం వచ్చినా అందుకు అనుమతించకూడదని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచి విడాకులకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టాను. దాదాపు 138 జంటలను ఒప్పించి విడాకులు తీసుకోకుండా అడ్డుకోగలిగాను. నా భార్యను మాత్రం ఒప్పించలేకపోయాను.. జంటలు విడాకులు తీసుకోకుండా చూసేవాడినని, దానివల్ల ఆదాయం బాగా తగ్గిపోయింది. నా భార్య ఇతర న్యాయవాదులను చూసి నన్ను పేద వాడిని అనుకునేది. ఈ క్రమంలోనే గొడవలు మొదలయ్యాయి. అవి విడాకులకు దారి తీసాయి” అని ఆ న్యాయవాది వాపోయాడు. ప్రస్తుతం ఈ న్యాయవాది ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Recommended Video: