
Groom Refused Marriage: పెళ్లి జరుగుతుంటే.. సరిగ్గా ముహూర్తం సమయానికి ఎవరో ఒకరు ఎంట్రీ ఇచ్చి.. వరుడు తాళి కట్టబోతుండగా ‘ఆపండి’ అనే పిలుపు వినిపించడం సినిమాళ్లో చూస్తా. అప్పుడప్పుడు సమాజంలో కూడా కొన్ని జరుగుతుంటాయి. కట్నం డబ్బులు ఇవ్వలేదని, వరుడు లేదా వధువుకు వేరొకరితో సంబంధం ఉందన్న కారణంతో ఇతరులు వచ్చి పెళ్లిని అడ్డుకోవడం జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఓ విచిత్ర కారణంతో ఏకంగా వరుడే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మౌలాలిలో జరిగింది.
మంచం పాతదని..
మౌలాలికి చెందిన మహ్మద్ జకారియా స్కూలు బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బండ్లగూడ రహమత్ కాలనీకి చెందిన యువతితో జకారియాకుపెళ్లి కుదిరింది. ఈ నెల 13న బండ్లగూడలో వధువు ఇంటి వద్ద నిశ్చితార్థం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం స్థానిక మసీదులో నిఖా జరగాల్సి ఉంది. వధువు కుటుంబీకులు శనివారం సాయంత్రం మంచం, ఇతర ఫర్నిచర్ జకారియా ఇంటికి పంపించారు. మంచం విడి భాగాలను జోడిస్తుండగా అవి విరిగి పోయాయి. పాత మంచానికి రంగులు వేసి పంపారని భావించిన జకారియా అత్తింటివారిపై కోపం పెంచుకున్నాడు. నిఖా సమయానికి పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు తండ్రి ఏం జరిగిందోనని వాకబు చేయడానికి వరుడి ఇంటికి వెళ్లారు. పెళ్లి సందర్భంగా తనకు పాత మంచం ఎందుకు ఇచ్చారంటూ జకారియా గొడవపడి నిఖాకు రానని చెప్పాడు. వరుడి తల్లి రహమతున్నిసా బేగం సైతం వధువు తండ్రితో గొడవపడింది. దీంతో వధువు తండ్రి జకారియాతోపాటు రహమతున్నిసాబేగంపై బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల జోక్యంతో పెళ్లికి సరే అన్న వరుడు..
ఈ క్రమంలో వరుడికి చాంద్రాయణగుట్ట ఎస్సై ఫోన్ చేశారు. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంపై మాట్లాడారు. చిన్న విషయానికి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం సరికాదని నచ్చచెప్పారు. దీంతో వరుడు పెళ్లికి సిద్ధమేనని చెప్పాడు. అయితే పోలీసుల ప్రయత్నాలతో వరుడి కుటుంబం దిగివచ్చినా అప్పటికే నిఖా ఆలస్యం కావడంతో వధువు తండ్రి పెళ్లికి నిరాకరించారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
