
IPAC- YCP: ఎక్కడైనా సరే.. ఫలానా రోడ్లు కావాలని ప్రజలు డిమాండ్ చేస్తారు. లేదంటే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విన్నపాలు చేస్తారు. కానీ ఏపీలో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మెరపెట్టుకుంటే రోడ్లు వేయడంలేదు. అదే ఓ ప్రైవేటు సంస్థ ఎక్కడ చెబితే అక్కడ రోడ్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఏపీలో ఎమ్మెల్యేలు ఉన్నట్టా.. లేనట్టా అన్న సందేహం వచ్చింది. ఏపీ ప్రభుత్వ తీరు ఈ సందేహానికి కారణమవుతోంది.
ఐప్యాక్.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఇదేదో పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటి అనుకునేరు. పేరు వింటే అలా భావిస్తాం తప్ప. ఇదొక ఫక్తు వ్యాపార దృక్పథం ఉన్న సర్వే సంస్థ. పొలిటికల్ కాంపెయిన్ మేనేజ్మెంట్ సంస్థ. నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధాని అయినప్పటి నుంచి ఐప్యాక్ సంస్థ పేరు వార్తల్లోకి వచ్చింది. ఐ ప్యాక్ తలుచుకుంటే తిమ్మిని బొమ్మి చేస్తుందనే ప్రచారం ఉంది. వాస్తవంగా ఇదంతా అబద్ధం. కాంట్రాక్టు కుదుర్చుకున్న రాజకీయ పార్టీ గెలుపుకు తెరవెనుక నుంచి ఏం చేయాలో అన్నీ చేస్తుంది. గెలిచే రాజకీయ పార్టీని ఎన్నుకుని.. వారికి ప్రచారం చేస్తారు. ఆ పార్టీ గెలిస్తే క్రెడిట్ తమదే అంటూ గొప్పలు చెప్పుకుంటారు. ఇప్పుడు ఐప్యాక్ గురించిన ఉపోద్ఘాతానికి ఏపీ ప్రభుత్వమే కారణమని చెప్పవచ్చు.
ఐప్యాక్ సంస్థ గ్రామాల్లో మౌలిక సదుపాయాల పై సర్వే నిర్వహించింది. ప్రజల నుంచి వివరాలు సేకరించింది. ప్రధానంగా రోడ్ల సమస్య ఉన్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించింది. ఏపీలో 70 శాతం గ్రామాలు రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. అంతర్గత రోడ్లు ఉంటే.. ఊర్లోకి వచ్చే మెయిన్ రోడ్ సరిగా ఉండదు. మెయిన్ రోడ్ సరిగా ఉండే.. అంతర్గత రోడ్లు సరిగా ఉండవు. ఇలా ఏదో ఒక సమస్య చాలా గ్రామాల్లో ఉంది. దీనిని ఐప్యాక్ బృందం గుర్తించింది. ఐప్యాక్ నివేదిక ప్రకారం ప్రతి ఊర్లోనే ఏదో ఒక సమస్య ఉంది. కాబట్టి ప్రతి ఊరి సమస్యను తీర్చే స్థితిలో ప్రభుత్వం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గానికి ఐదు ప్రధాన రోడ్లను ఎంచుకున్నారు. వీటిని ఐప్యాక్ ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేసి.. ఎన్నికల లోపు పూర్తీ చేస్తారు.

ఐప్యాక్ నివేదిక మేరకు ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పూనుకోవడం సొంత పార్టీ ఎమ్మెల్యేలను అసంతృప్తికి గురిచేస్తోంది. తాము చెబితే వినని ప్రభుత్వం.. ఇప్పుడు ఐప్యాక్ చెబితే రోడ్లు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ రోడ్లు వేయాలో తమకు తెలియదా ? . ఎక్కడ ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నారో తమ కంటే ఐప్యాక్ వారికి బాగా తెలుసా ? అని ఎమ్మెల్యేలు లోలోప మధనపడుతున్నారు. ప్రభుత్వం అటు ఎమ్మెల్యేలు.. ఇటు ఇంజినీర్ల ప్రతిపాదనలు తోసిపుచ్చి.. ఐప్యాక్ బృందం నిర్ణయించిన రోడ్లకే మమర్దశ కల్పించనుంది. ప్రభుత్వ తీరు పై సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సర్వే సంస్థ విధి ప్రజల నాడిని పసిగట్టడం. దానిని ప్రభుత్వానికి, పార్టీనికి నివేదించడం. కానీ ఐప్యాక్ సంస్థ.. జగన్ అండతో అన్ని విషయాల్లోకి తలదూర్చుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
