Kerala: కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతారు. వారితో సన్నిహిత సంబంధాలు గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమవుతారు. ఎంతటి శత్రువు అయినా మరణిస్తే చుక్క కన్నీటిని కార్చుతారు. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యం బారిన పడినా..అచేతనంగా ఉన్నా ప్రాణాలతో ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటారు. కానీ ఓ కుటుంబం మాత్రం తన కుటుంబ యజమాని మరణాన్ని వేడుకగా చేసుకుంది. పార్థివ దేహం వద్ద నవ్వుతూ కనిపించడమే కాకుండా.. కుటుంబసభ్యులంత నవ్వతూ గ్రూప్ ఫొటోకు దిగారు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజెన్లు మండిపడుతున్నారు. ఇదేం సంస్కృతి అని ప్రశ్నిస్తున్నారు. వారి వైఖరిని తప్పుపడుతున్నారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని పత్తనంతిట్టలోని 95 సంవత్సరాల మరియమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఈ నెల 17న మృతిచెందారు. మరియమ్మకు తొమ్మిది మంది సంతానం. దీంతో ఆ కుటుంబాలకు చెందిన 50 మంది వరకూ ఒక చోటకు చేరుకున్నారు. పార్థివ దేహం వద్ద ఫొటోలు తీసుకున్నారు. అయితే నవ్వుతూ వారు కనిపించడమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మండిపడిన నెటిజెన్లు..
శవపేటిక వద్ద పెద్దవారి నుంచి చిన్నవారు వరకూ నవ్వుతూ కనిపించారు.అత్యంత ప్రియమైన వ్యక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే ఎవరైనా ఇలా నవ్వుతారా? అంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు.ఆ కుటుంబంపై హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆటీవల అవి తీవ్రమవుతుండడంతో ఆ కుటుంబం స్పందించింది. ‘తమ కుటుంబానికి మరియమ్మ ప్రేమను పంచిందని..కుటంబం ఈ స్థితిలో ఉండడానికి ఆమె ప్రేమ, చిరునవ్వే కారణమని, అందుకే ఆమెకు ఘనమైన నివాళి అర్పించాలనుకున్నామని.. లోపల బాధ ఉన్నా చిరునవ్వుతో వీడ్కోలు ఇవ్వాలన్నదే తమ అభిమతం’ అని కుటుంబసభ్యులు వివరణ ఇచ్చారు.
Also Read: Polygamy Legal in Eritrea: రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలుకే..
మరియమ్మ మరణానంతరం ఆమెను తాము గుర్తుచేసుకుంటున్నామని..బంధువులు తెలిపారు. ఆమె చిరునవ్వుతో పంచిన ప్రేమాభిమానాలను నెమరువేసుకొని నవ్వుతూ ఫొటోలకు దిగామని సమర్థించుకున్నారు. చిరునవ్వుతో దిగిన ఈ ఫొటో ఉద్దేశపూర్వకంగా తీసుకున్నామని కూడా చెబుతున్నారు. మరియమ్మ కోసం 24 గంటల పాటు ప్రార్థనలు చేశామని కూడా చెప్పారు. మరణిస్తే కన్నీరు పెట్టుకునే అలవాటు ఉన్నవారు తమ ఫొటోను అంగీకరించలేరని కూడా చెప్పుకొచ్చారు. ఈ ఫొటొను తమ కుటుంబసభ్యుల కోసం తీసుకున్నామని.. సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యిందో తెలియదని చెబుతున్నారు.

మంత్రి స్పందనతో సుఖాంతం..
సోషల్ మీడియాలో ఆ కుటుంబంపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి స్పందించారు. ఆ కుటుంబంపై నెగిటివ్ కామెంట్స్ వద్దని నెటిజెన్లకు విన్నవించారు. మరియమ్మ మరణం అత్యంత బాధాకరమన్నారు.ఇంతకాలం నవ్వుతూ జీవించిన ఆమెకు చిరునవ్వుతో వీడ్కోలు పలకడం కంటే నిజమైన నివాళి ఏముంటుందన్నారు.దీనిని బూతద్ధంలో చూడడం తగదన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. నెటిజెన్లు సంయమనంతో ఆలోచించాలని మంత్రి విన్నవించారు. కథను సుఖాంతం చేశారు.

