Honeymoon: ఎంతో ఆనందంగా ఆ నవ దంపతులు హనిమూన్ కు ప్లాన్ చేసుకున్నారు. దాని కోసం ప్రత్యేక ప్రణాళిక వేసుకున్నారు. ఓ ప్రైవేటు ఏజెన్సీని ఆశ్రయించారు. దీనికిగాను ప్యాకేజీ కూడా చెల్లించారు. కానీ సదరు ఏజెన్సీ నిర్వాహకులు నవ దంపతులను సముద్రం మధ్యలో విడిచిపెట్టేశారు. ఏం చేయాలో పాలుపోని ఆ నవజంట ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సముద్రంలో సాహస ఈతకు దిగారు. అత్యంత ప్రమాదకర స్థితిలో ఈదుకొని ఒడ్డుకు చేరుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ ఘటన.. ఆ నవ జంట కోర్టును ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు ఏజెన్సీ నిర్లక్ష్యంపై ఆ నవ జంట ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగడం అందర్నీ ఆకట్టుకుంటోంది.
Also Read: PM Modi Vs Opposition Parties Leaders: మోడీ సంగతి సరే.. విపక్ష నేతలూ మీ నలుపు మాటేమిటి?
కాలిఫోర్నియాకు చెందిన ఎలిజిబెత్ వెబ్ స్టెర్, అలెగ్జాండర్ బర్కల్ లు 2021లో వివాహం చేసుకున్నారు. హనీమూన్ బాగా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అక్కడి హవాయి దీవుల్లోని లునాయ్ అనే ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం సెయిల్ మౌయీ అనే పర్యాటక ఏజెన్సీని ఆశ్రయించారు. సెప్టెంబరు 2021న టూర్ కు బయలుదేరారు. అందులో భాగంగా డైవింగ్ మాస్కులు, స్విమ్ ష్యూట్ లు ధరించి సముద్ర గర్భంలో స్నొర్కెలింగ్ కు బయలుదేరారు. సుమారు 44 మంది పర్యాటకులను తీసుకెళ్లిన పడవను ఓ చోట నిలిపారు. ఈతకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పిన సదరు కెప్టెన్.. వారు ఏ వేళకు చేరుకోవాలన్నది మాత్రం చెప్పలేదు.
ఒక గంట పాటు సముద్రంలో ఈతకు దిగిన ఆ నవజంటకు ఆందోళనకర పరిస్థితి ఎదురైంది. సముద్ర గమనం మారుతుండడాన్ని గుర్తించిన ఆ జంట పడవ వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పడవ దూరం జరిగిపోతూ వెళుతోంది. దీంతో హఠాత్ పరిణామంతో ఆందోళనకు గురైన జంట ఈతతో ముందుకు సాగుతున్నారు. మధ్యలో అలసటకు గురికావడంతో ఐల్యాండ్ నివాసి ఒకరు సాయం చేశారు. దీంతో అతి కష్టమ్మీద వారు ఒడ్డుకు చేరుకోగలిగారు. అయితే ఈ నిర్లక్ష్యానికి బాధ్యులను చేస్తూ పర్యాటక ఏజెన్సీపై ఆ జంట ఈ ఏడాది ఫిబ్రవరి 23న కోర్టును ఆశ్రయించారు. తమ ప్రాణానికి హాని కలిగించేలా వ్యవహరించినందున 5 మిలియన్ డాలర్లు (రూ.40 కోట్లు) ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే సంఘటన జరిగింది 2021 సెప్టెంబరులో అయితే.. ఇప్పుడు కేసు పెట్టడం మాత్రం చర్చనీయాంశమైంది.
Also Read:Janhvi Kapoor: ఎన్టీఆర్ 30: జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రివ్యూ…