
MS Dhoni Sixes: వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ గా ధోనీకి మంచి పేరు ఉంది. ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్ లను ధోని గెలిపించాడు. చివరి ఓవర్ వరకు మ్యాచ్ వెళ్లిందంటే.. క్రీజులో ధోని ఉన్నాడంటే అవతలి జట్టు ఆశలు వదులుకోవాల్సిందే. టార్గెట్ ఎంతైనా తనదైన శైలిలో ధోని ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. అటువంటి ధోని మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐపిఎల్ లో చివరి ఓవర్లో బ్యాటింగ్ చేసి అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో ధోని టాప్ లో ఉన్నాడు.
చివరి ఓవర్లో అత్యధిక సిక్సులు ధోనీవే..
టి20 క్రికెట్లో ధోని అద్వితీయమైన ఆటతో అభిమానులను అలరిస్తుంటాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కు వచ్చే ధోని.. ఎక్కువసార్లు ఓవర్లు పూర్తయ్యేంతవరకు క్రేజులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెన్నై జట్టు ఎన్నోసార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాలను అందించాడు. ధోని ఆడిన మ్యాచ్ ల్లో ఎక్కువ సందర్భాల్లో టాపార్డర్ ఫెయిల్ అయి.. బ్యాటింగ్ భారాన్ని తాను మోయాల్సి వచ్చినవే ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో వచ్చిన ధోని మెల్లగా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసి.. కుదురుకున్నాక చివరి రెండు, మూడు ఓవర్లలో తన విశ్వరూపాన్ని చూపిస్తుంటాడు. దీంతో చివరి ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టడం ధోనీకి అలవాటు. అదే ఇప్పుడు ధోనీకి మరో అరుదైన రికార్డును తెచ్చిపెట్టింది. 20వ ఓవర్లో బ్యాటింగ్ చేసిన బ్యాటర్లలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా ధోని రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో చివరి ఓవర్ లో సిక్సులు ద్వారా ధోనీ 342 పరుగులు సాధించాడు.

దరిదాపుల్లో లేని మిగిలిన ప్లేయర్లు..
ధోని ఐపిఎల్ కెరియర్లో చివరి ఓవర్ లో బ్యాటింగ్ చేసి 57 సిక్సులు కొట్టాడు. ఆ తరువాత స్థానంలో వెస్టిండీస్ క్రికెటర్ పోలార్డ్ 33 సిక్సులతో ఉన్నాడు. మూడో స్థానంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 26 సిక్సులతో ఉన్నాడు. 25 సిక్సులతో హార్థిక్ పాండ్యా నాలుగో స్థానంలో, 23 సిక్సులతో రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. ధోనీకి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ఇప్పట్లో ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేసే అవకాశం కనిపించడం లేదు.