
Khammam: కడవరకూ కలిసి ఉందామనుకున్నారు.. వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే ఆర్థి ఇబ్బందులు, అనుమానాలతో వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. సర్దుకు పోతూ వచ్చిన ఆ వివాహిత భర్తలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందింది. ఇక కలిసి ఉండడం కష్టం అని భావించింది. చనిపోవాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో భర్తకు ఫోన్‌చేసి ‘నేను వెళ్లిపోతున్నా.. మీరే ఆనందంగా ఉండండి..’ అని చెప్పి ఆత్మహత్య చేసుకుంది.
సత్తుపల్లిలో ఘటన..
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కాకర్లపల్లిరోడ్డులో నివాసం ఉంటున్న షేక్ షాకీరాబేగం(35)కు కారు మెకానిక్ ముజీబ్‌తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. షాకీరా మెహిందీ ఈవెంట్లకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో భర్త మద్యం అలవాటు చిచ్చుపెట్టింది. ముజీబ్ నిత్యం తాగొస్తూ డబ్బుల కోసం భార్యతో గొడవ పడుతున్నాడు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా ముజీవ్ మారలేదు. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. కానీ భర్తలో షాకీరాబేగం ఆశించిన మార్పు రాలేదు.
ఆదివారం రాత్రి గొడవ..
ఆదివారం రాత్రి కూడా డబ్బుల కోసం భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో కుమారులు సాహిల్, ఆహిల్‌ను తీసుకొని ముజీబ్ బయటకు వెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన షాకీరాబేగం ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకుంది. క్షణికావేశంలో భర్తకు ఫోన్ చేసి ‘మీ ముగురూ ఆనందంగా మంచిగా ఉండండి..’ అని చెప్పి ఫోన్ కట్‌చేసింది. తర్వాత చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
విగత జీవిగా..
భార్య ఫోన్ కట్‌చేయడంతో ఆందోళనకు గురైన ముజీబ్ పిల్లలను తీసుకుని కంగారుగా ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు వేసి ఉండడంతో పగులగొట్టి చూడగా షాకీరా ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దింపి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

కుటుంబ సభ్యుల అనుమానం..
అయితే షాకీరా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముజీబే చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు నటిస్తున్నాడని షాకీరా సోదరి సబియా ఆరోపించింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ముజీబ్ మద్యానికి బానిసై డబ్బుల కోసం తన చెల్లిని వేధించేవాడని, ఈ క్రమంలో అతనే చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.రాము తెలిపారు.