
MLC Kavitha: తెలంగాణ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారాల పట్టి.. కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. ఆమె కాలికి గాయమైంది. పరీక్షించిన వైద్యులు.. 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈమేరకు కవితనే స్వయంగా ట్వీట్ చేశారు. ‘నా కాలికి గాయం అవ్వడంతో మూడు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది.’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏమై ఉంటుంది..
అయితే కాలికి గాయం అయినట్లు మాత్రమే ట్వీట్ చేసిన కవిత ఎలా జరిగిందనే విషయం మాత్రం తెలుపలేదు. దీంతో ఏమై ఉంటుంది అన్న చర్చ కూడా మొదలైంది. గాయం నిజమేనా.. లేక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నుంచి మళ్లీ ఏమైనా పిలుపు వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఈడీ పిలిచినప్పుడు కవిత మొదట తనకు ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని మొదట తెలిపారు. తర్వాత రెండోసారి పిలిచినప్పుడు విచారణకు వెళ్లారు. మూడోసారి పిలిచినప్పుడు నోటీసుల్లో వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొనలేదని తన లాయర్ ద్వారా డాక్యుమెంట్లు పంపించారు. మూడోసారి పిలుపుకు ఈడీ కూడా స్పష్టంగా వ్యక్తిగతంగా రావాలని నోటీసుల్లో పేర్కొంది. నాలుగోసారి ఫోన్లు అప్పగించాలని సూచించడంతో ఫోన్లు తీసుకుని వెళ్లింది.
ఆ ఫోన్లలో ఏముంది?
కవిత ఈడీ అధికారులకు ఫోన్లు అప్పగించి దాదాపు 15 రోజులు దాటింది. అప్పగించిన వారం తర్వాత వాటిని తెరుస్తున్నట్లు వ్యక్తిగతంగా గానీ, సహాయకుడి ద్వారాగానీ రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో కవిత మళ్లీ తన లాయర్‌ను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పంపించారు. వరుసగా రెండు రోజులు లాయర్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఫోన్లు ఓపెన్ చేసి పది రోజులు అయినా ఇప్పటి వరకు అందులో ఏముందన్న విషయం బయటకు రాలేదు. ఇటు కవిత వైపు నుంచి కూడా ఫోన్లలో ఏమీ లేదన్న ప్రకటన రాలేదు. ఈ క్రమంలో మళ్లీ ఈడీ నుంచి పిలుపు రావొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కవిత కాలికి గాయం కావడం చర్చనీయాంశమైంది.

ఏది ఏమైనా ఎమ్మెల్సీ కవిత గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులు కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ మేడమ్!!