Temperature Increased
Temperature : వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్(Global warming) కారణంగా భూమి వేడెక్కుతోంది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇక సీజన్‌లు కూడా మారిపోతున్నాయి. వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి. ఎండా కాలంలో వానలు కురుస్తున్నాయి. శీతాకాలం చలి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అతి శీతలంగా ఉంటుంది. దీంతో వ్యాధులు ముసురుకుంటున్నాయి. కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో శీతాకాలం సీజన్. కానీ వాతావరణం భిన్నంగా మారుతోంది. ఉత్తర భారత దేశంలో చలి ప్రభావం కొనసాగుతుండగా, దక్షిణ భారత దేశంలో వాతావరణం వేడెక్కుతోంది. జనవరి చివరి వారం నుంచే క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. 30 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి 1వ తేదీన 34 డిగ్రీలు దాటింది. దీంతో వేసవి ముందే వచ్చిందా అన్న భావన కలుగుతోంది. ఏటా వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2024 వేసవిలో 50 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలోనూ అంతే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2023లో ఆరు నెలలు సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2024లో అయితే ఏడాదంతా సాధారణం కన్నా ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
2024లో రికార్డు ఉష్ణోగ్రత..
1901 నుంచి సేకరిస్తున్న సమాచారం ప్రకారం.. 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 0.65 డిగ్రీలు పెరిగింది. గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కన్నా 0.37 డిగ్రీలు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో సగటు ఉష్ణోగ్రత 0.94 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. 1958లో గరిష్టంగా 1.17 డిగ్రీలు, 1990లో 0.97 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ తర్వాత ఈ జనవరిలో నమోదైనదే అత్యధికం.
’లానినా’ పైనా ప్రభావం
వాతావరణ మార్పుల ప్రభావం లానినా పరిస్థితులపై పడుతోంది. లానినా పరిస్థితులు బలహీన పడడంతో శీతాకాలంలోనూ చలి తీవ్రత అసాధారణంగా లేదు. వచ్చే వారం తూర్పు, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగతాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ, వాయువ్య భారతంలో కొన్ని మినహా అన్ని ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంటున్నారు.
ఆధోనిలో 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత..
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రెండు రోజులుగా ఉక్కపోత మొదలైంది. కర్నూలు జిల్లా ఆధోనిలో శుక్రవారం గరిష్టంగా 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్, ఏలూరు తదితర జిల్లాలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. శుక్రవారం(జనవరి 31న) తుని, నందిగామ, గన్నవరం, నంద్యాల, కడప తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉక్కపోత పెరుగుతుందని తెలిపింది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Temperatures near 35 degrees in february alone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com