Telugu Media: ప్రతినెల 11వ తేదీన ఆంధ్రజ్యోతిలో ఉద్యోగులకు వేతనాలు తమ ఖాతాలో జమవుతాయి. అయితే ఈ నెలలో అందరూ ఉద్యోగులకు వారి వారి వేతనాల ఆధారంగా 10 నుంచి 12 శాతం పెంపుదల కనిపించింది. హైదరాబాదులో పని చేసే వారికి ఇంకాస్త ఎక్కువగా ఉందని తెలుస్తోంది.. సుదీర్ఘకాలం తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ జిల్లాల్లో పర్యటించారు. ఆయన వెంట కుమారుడు ఆదిత్య, అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ, నెట్వర్క్ ఇన్చార్జి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. జిల్లాలలో జరిగిన సమావేశాలలోనే వేతనాల పెంపుదల గురించి రాధాకృష్ణ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. మిగతా పత్రికలతో పోల్చి చూసుకుంటే ఆంధ్ర జ్యోతిలో కాస్త వేతనాలు తక్కువగానే ఉంటాయి. ఈనాడు వేజ్ బోర్డ్ అమలు చేస్తుంది. సాక్షిలో మ్యాన్ పవర్ అధికంగా ఉంటుంది కాబట్టి.. వేతనాలు కూడా పర్వాలేదనే స్థాయిలోనే ఉంటాయి. ఎటోచ్చి ఆంధ్రజ్యోతిలోనే వేతనాలు కాస్త తక్కువగా ఉంటాయి. పైగా రిపోర్టర్లకు, బ్యూరో చీప్ లకు యాడ్స్ టార్గెట్, సర్క్యులేషన్ టార్గెట్స్ ఉంటాయి. సాక్షిలో ఇలాంటి విధానం ఉన్నప్పటికీ.. మరీ ఆంధ్రజ్యోతి యాజమాన్యం లాగా రాచి రంపాన పెట్టదు. కోవిడ్ కాలం నుంచి ఆంధ్రజ్యోతిలో అంతంతమాత్రంగానే వేతనాల పెంపుదల ఉంది. కోవిడ్ సమయంలో అయితే ఉద్యోగులకు సగం వేతనాలు మాత్రమే ఇచ్చారు. కొంతమంది ఉద్యోగులను మెడపట్టి బయటికి పంపించారు. కాస్ట్ కటింగ్ అత్యంత తీవ్రంగా చేశారు..
కోవిడ్ తగ్గిన తర్వాత.. వేతనాల పెంపుదల విషయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం పెద్దగా దృష్టి సారించలేదు. ఇక ఇటీవల ఏం జరిగిందో తెలియదు గానీ రాధాకృష్ణ జిల్లాల పర్యటనలకు వచ్చారు.. వేతనాల పెంపుదల ఉంటుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా సర్కులేషన్ పెంచాలని.. పేపర్ ను నెంబర్ వన్ స్థానంలోకి తీసుకురావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సర్కులేషన్ పెంచుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కారు రేస్ డ్రా అని పెట్టారు. సర్కులేషన్ ఎంతవరకు పెరిగిందో తెలియదు కానీ.. ఉద్యోగులకు ఇచ్చిన మాటనయితే రాధాకృష్ణ నిలుపుకున్నారు. వేతనాలను పెంచి.. జనవరి నెల సాలరీ లో కలిపి ఇచ్చారు.. వేతనాల పెంపుదలను చూసి ఉద్యోగుల సంబర పడుతున్నారు. కాగా, వేతనాల పెంపుదల కంటే ముందు.. ఆంధ్రజ్యోతి యాజమాన్యం పేపర్లో పేజీల సంఖ్యను పెంచింది. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.