YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం. ఏ1 ముద్దాయిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దయ్యింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. గత కొద్దిరోజులుగా గంగిరెడ్డి బెయిల్ ను రద్దుచేయాలని సీబీఐ కోరుతూ వచ్చింది. చివరకు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. చివరకు తెలంగాణ హైకోర్టులో సీబీఐ అనుకున్నది సాధించింది. సుదీర్ఘ విచారణల అనంతరం హైకోర్టు తీర్పు వెలవరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. మే 5 వ తేదీలోపు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో సీబీఐ అనుకున్నది సాధించినట్టయ్యింది. ఇప్పటికే కేసు విచారణలో దూకుడు మీద ఉన్న సీబీఐ అన్ని సమస్యలను చేధించుకుంటూ ముందుకు సాగుతోంది.
ఏ1 ముద్దాయిగా..
వివేకా హత్య జరిగినప్పుడు ఏ1గా గుర్తించింది ఎర్ర గంగిరెడ్డినే. కేసు నమోదుచేసిన ఏపీ పోలీసులు గంగిరెడ్డిని 2019 మార్చి 28న అరెస్టు చేశారు. ఆ తరువాత ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వ కొలువుదీరడం జరిగిపోయింది. పోలీసులు నిబంధనల ప్రకారం 90 రోజుల్లో అంటే జూన్ 28 లోగా చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలం కావడంతో పులివెందుల కోర్టు ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కేసు సీబీఐ చేతికి వెళ్లడం, వారి చార్జిషీట్ లో ఏ1గా ఎర్ర గంగిరెడ్డి పేరుండడం జరిగింది. అయితే బెయిలు మాత్రం రద్దు కాలేదు. ఒకసారి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చాక, మెరిట్స్ ఆధారంగా రద్దు కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటి నుంచి గంగిరెడ్డి బెయిల్ పైనే ఉన్నారు.
అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టినా..
అయితే గంగిరెడ్డి బెయిల్ ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించింది. కానీ కలుగజేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం ముందుకు రాలేదు. కానీ ఒకసారి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చినా సరే.. తర్వాత మెరిట్స్ ను బట్టి రద్దు చేయకూడదని అనుకోవడం కరెక్టు కాదని, మెరిట్స్ పరిశీలించి బెయిల్ రద్దు చేయవచ్చునని సుప్రీం కోర్టు పేర్కొంది. కేసు తెలంగాణకు బదిలీ కావడంతో… తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
చాకచక్యంగా సీబీఐ..
ఇక్కడే సీబీఐ చాకచక్యంగా వ్యవహరించింది. గంగిరెడ్డిపై బలమైన అభియోగాలు మోపింది. విచారణను అత్యంత ప్రభావితం చేసే వ్యక్తి గంగిరెడ్డి అని ఆయన బయట ఉండటం వల్ల సాక్షులు ముందుకు రావడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేక హత్యలో ప్రధాన పాత్ర పోషించింది ఆయనేనని ఆధారాలతో సహ వాదించింది. ప్రధాన నిందితుడిగా ఉండి ఇతను బయట ఉండటంతో సాక్షులు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారన్నారని తెలిపింది. ఏపీ హై కోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామని పేర్కొంది. సీబీఐ వాదనతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు వెంటనే గంగి రెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. మే 5లోగా లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది.