Governor Tamilisai- KCR: తమిళి సై తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు.. నాకు సొంత చెల్లె కూడా. ఈరోజు నుంచి ఆమె తెలంగాణ ఆడపడుచు.. తెలంగాణ ఆడపడుచుకు పుట్టింట్లో ఎంత గౌరవం ఉంటుందో… ఆమెకు అంతకుమించి గౌరవ మర్యాదలు ఇక్కడ దక్కుతాయి” ఇవీ తెలంగాణ గవర్నర్ గా తమిళి సై సౌందర రాజన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. మొదట్లో అటు రాజ్ భవన్, ఇటు ప్రగతి భవన్ మధ్య రాకపోకలు బ్రహ్మాండంగా ఉండేవి.. ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పుడే మంటలు మొదలయ్యాయి.. ఆ తర్వాత అవి క్రమక్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాయి.. ఎవరికివారు పంతాలకు పోవడంతో అటు శాసన వ్యవస్థ పనితీరు, ఇటు రాజ్యాంగ వ్యవస్థ పనితీరు చర్చనీయాంశం అయ్యాయి.. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాలు రావడంతో తెలంగాణ గవర్నర్ ను కలవడం ప్రభుత్వానికి అనివార్యంగా మారింది.. మొత్తానికి అది అంతా దారికి తీసుకొచ్చింది.

ఒకే ఒక్క సందర్భం.. అన్ని వ్యవహారాలనూ దారికి తెచ్చింది. రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య ఏర్పాట దూరాన్ని కరిగిపోయేలా చేసింది. గవర్నర్ కు పర్యటనలో ప్రోటోకాల్ కల్పించేలా చేసింది. గవర్నర్ పట్ల ప్రభుత్వం సంప్రదాయాలు పాటించేలా చేసింది. గవర్నర్ కూడా ప్రభుత్వం తయారుచేసి ఇచ్చిన ప్రసంగాన్నే యధాతధంగా చదివేలా చేసింది.. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం పొందాల్సిన అవసరమే వీటన్నింటికీ కారణమైంది. శుక్రవారం శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎటువంటి ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా,అసలు కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన లేకుండా సాగింది. 26 పేజీలు, 47 అంశాలు, 32 నిమిషాల పాటు సాగిన ప్రసంగం ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా ముగిసింది. దీంతో గవర్నర్ కు , ప్రభుత్వానికి మధ్య విభేదాలు సమిసిపోయినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. అంటే ఉభయ కుశలోపరి మంత్రాన్ని జపిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే గవర్నర్ ప్రసంగంలో మార్పు చేసిందా? లేదంటే గవర్నర్ ప్రమేయం, సూచనలతోనే మార్పులు జరిగాయా? అనేది లేదు.
వాస్తవానికి శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రసంగం చుట్టూ తొలుత వివాదాలు అలముకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు కాని చ్చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కౌంటర్ గా బడ్జెట్ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలపకుండా… “గవర్నర్ ప్రసంగం ఉందా” అంటూ రాజ్ భవన్ నుంచి తిరుగు టపా వచ్చింది. ఈ క్రమంలో ఏకంగా గవర్నర్ పై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.. అయితే హైకోర్టు సూచనలతో గవర్నర్ ప్రసంగం ఉండాలని అంశంపై ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది..

గవర్నర్ ప్రసంగానికి అంగీకరించినా… సర్కారు తయారుచేసిన ప్రసంగాన్నే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చదవాల్సి ఉంటుంది. అయితే తమిళనాడులో బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రసంగం కాకుండా… కొన్ని మార్పులతో ఆ రాష్ట్ర గవర్నర్ చదవడం.. అధికార పార్టీ నిరసన తెలపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు పరిణామాల ప్రభావంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు, వివాదాలకు తావు లేకుండా ప్రసంగానికి తుది రూపు ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగంలో ఒకటి రెండు చోట్ల కేంద్రం తీరుపై విమర్శల ప్రస్తావన, కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పు పట్టిన దాఖలాలూ ఉన్నాయి. 2019 బడ్జెట్ ప్రసంగంలో రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంతో పోరాటం చేస్తామని ప్రభుత్వం అప్పటి గవర్నర్ నరసింహన్ తో చెప్పించింది. అయితే తనకు వచ్చే ప్రసంగంలో ప్రభుత్వ ప్రసంగానికి పూర్తిగా ఆమోదం తెలుపుతూనే కొన్ని స్వల్ప మార్పులతో పాటు తనదైన ముద్రను ప్రసంగంలో ఉండేలా నరసింహన్ చూసుకునేవారు. ఆ తర్వాత తమిళి సై రాకతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. పూర్తిగా రాజకీయ నేపథ్యం కలిగిన గవర్నర్ గా ఉండటంతో కొన్ని ప్రతికూలతను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. అయితే బడ్జెట్ ప్రసంగం వివాదాలకు చోటు లేకుండా ముగియడంతో అధికార పక్షం ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది. ఇక గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు అధికార పార్టీ సభ్యులు చప్పట్లతో స్వాగతించారు. గవర్నర్ శుక్రవారం ఉదయమే యాదగిరి గుట్ట కు రోడ్డు మార్గంలో వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.. గతంలో ఆమె ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ పాటించని అధికారులు.. ఈసారి మాత్రం వంగి వంగి దండాలు పెట్టారు.