
Anasuya Bharadwaj: అనసూయ తత్వం తెలిసిందే. ఎవడో ముక్కు మొహం తెలియనోడు ఏదో అన్నాడులే అని వదిలేయదు. హర్ట్ అయ్యేలా కామెంట్ చేస్తే వెంటనే తిరిగి ఇచ్చేస్తుంది. నెటిజెన్స్ ట్రోల్స్ పై అనసూయ తరచుగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడారు. ఇప్పటికీ ఆడవాళ్లు ఉద్యోగం చేయడాన్ని కొందరు తప్పుగా చూస్తున్నారని, నా ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తున్నారు… అని అన్నారు.
ఈ వీడియో షేర్ చేసి అనసూయ ప్రియాంక కామెంట్స్ ని సమర్ధించారు. ఆడామగా సమానం. ఇద్దరూ కలిసి పని చేయడం ద్వారా ప్రపంచం ముందుకు వెళుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక వ్యవస్థలా పని చేయాలని కామెంట్ చేశారు. అనసూయ కామెంట్ కి ఓ నెటిజెన్ కౌంటర్ వేశాడు. అయితే నీ కొడుకులకు వంట నేర్పు. రేపు భార్య ఉద్యోగం చేస్తుంటే ఇంటి పనులు చేస్తారు, అని అర్థం వచ్చేలా కామెంట్ పోస్ట్ చేశాడు.
సదరు నెటిజెన్ కామెంట్ కి అనసూయ వెంటనే రియాక్ట్ అయ్యారు. తప్పకుండా నేర్పిస్తాను. 11 ఏళ్ల మా అబ్బాయి ఇప్పటికే వంట చేస్తున్నాడు. కిచెన్ లో నాకు సహాయం చేస్తాడు. నా కొడుక్కి వంట చేయడమే కాదు, కుటుంబాన్ని ఎలా పోషించాలో కూడా నేర్పుతున్నాను. నా కొడుకు, వాడి భార్య ఎలా జీవించాలో మనం నిర్ణయించలేం. అది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. జనాలతో వచ్చిన సమస్య ఇదే. ముందు నీ పని నువ్వు చూసుకో… అని చురక అంటించింది.

అనసూయ సమాధానం వైరల్ అవుతుంది. అనసూయ తనపై వచ్చే ట్రోల్స్ కి తప్పకుండా రియాక్ట్ అవుతారు. మితిమీరి కామెంట్స్, ట్రోల్ చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడరు. అనసూయ కొందరిని జైలుకు కూడా పంపారు. అయినా ఆమె మీద ట్రోల్స్ ఆగవు. సోషల్ మీడియాలో అనసూయ అత్యంత నెగిటివిటీ ఎదుర్కొంటుంది. అనసూయ డ్రెస్సింగ్, యాటిట్యూడ్, బిహేవియర్ ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. యాంకరింగ్ మానేసిన అనసూయ నటిగా కొనసాగుతున్నారు.