
Jaganasura Rakta Charitra: గత ఎన్నికల ముందు చాలా ఘటనలు వైసీపీకి రాజకీయంగా లాభించాయి. అందులో ప్రధానమైనది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన హత్యను జగన్ చాలా పద్ధతి ప్రకారం వినియోగించుకున్నారు. తొలుత గుండెపోటు అని చెప్పినా.. తరువాత గొడ్డలితో నరికేశారంటూ స్వయంగా నాటి విపక్ష నేతగా ఉన్న జగనే ప్రకటించారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ అప్పటి చంద్రబాబు సర్కారుపై ఆరోపణలు చేశారు. సాక్షిలో ఒక అడుగు ముందుకేసి ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ పతాక శీర్షికన కథనాలు వండి వార్చారు. చంద్రబాబు స్పందించి సీబీ సీఐడీ విచారణకు ఆదేశాలిచ్చినా అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తునకు పట్టుబట్టారు. నాటి ఎన్నికల సభల్లో సైతం వివేకానందరెడ్డి హత్య కేసు హైలెట్ చేసి సానుభూతి పొందడంలో సఫలీకృతులయ్యారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడానికి అసలు ప్రేరణ ఇదీ
అయితే అధికారంలోకి వచ్చాక హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. అసలు దీనికి సీబీఐ దర్యాప్తు అవసరమే లేదని తేల్చేశారు. కానీ వివేకా కుమార్తె పట్టుబట్టడం, ఆమెకు షర్మిళ మద్దతివ్వడంతో న్యాయపోరాటం చేసి మరీ సీబీఐ దర్యాప్తును కొనసాగేలా చూసుకున్నారు. అయితే దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం, తిరిగి సీబీఐ అధికారులను బెదిరించే స్థాయికి రావడంతో కేసును పక్క రాష్ట్రానికి మళ్లించాలని మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో తెలంగాణకు కేసు మారడంతో విచారణ ఊపందుకుంది. అనుమానితులుగా ఉన్న వారందరికీ సీబీఐ నోటీసులిచ్చి విచారణ చేసే పనిలో ఉంది.
ప్రధాన అనుమానితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారణ చేసింది. కీలక సమాచారాన్ని రాబెట్టింది. ఆ తరువాతే సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి భారతీరెడ్డి పేర్లు బాగా హైప్ అవుతున్నాయి. త్వరలో వారిని కూడా విచారించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్, కుటుంబ సహాయకుడు నవీన్ తో పలుమార్లు మాట్లాడడాన్ని గుర్తించిన సీబీఐ వారికి నోటీసులిచ్చింది. విచారణకు హజరుకావాలని ఆదేశించినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని రాజకీయంగా వినియోగించుకోవాలని టీడీపీ డిసైడ్ అయ్యింది.

తెలుగుదేశం పార్టీ తాజాగా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. వివేకా హత్యకేసులో సూత్రధారులు ఎవరు? పాత్రదారులు ఎవరు? అంటూ వివరాలతో ఒక పుస్తకాన్ని రూపొందించింది. నాడు ఎన్నికల ముందు నారాసుర రక్తచరిత్ర ప్రచారానికి ధీటుగా ‘జగన్ రెడ్డి నరహంతక పాలనను చరమగీతం పాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’ అన్న నినాదంతో టీడీపీ పుస్తకాన్ని విడుదల చేసింది. తాడేపల్లి ప్యాలెస్ సాయం లేకుండా ఇన్ని నేరాలు, ఘోరాలు సాధ్యం కావని పుస్తకంలో పేర్కొనే ప్రయత్నం చేసింది. సీబీఐ కి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ వివరాలు, సీబీఐ చార్జిషీట్లు, వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన అఫిడవిట్లు, వైఎస్ కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో కూడిన వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో పార్టీ సీనియర్లు పుస్తకాన్ని విడుదల చేశారు.
Also Read: Mahasena Rajesh: మహాసేన రాజేశ్ పార్టీ మార్పు వార్తల్లో నిజమెంత?