
TDP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ పోరుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాములను చేసింది. ఇప్పుడు ఇదే అంశాన్ని లక్ష్యంగా చేసుకుని టిడిపి ముందుకు వెళ్లబోతోంది. జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొని ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటిస్తే ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ తమ శ్రేణులకు పిలుపు ఇచ్చింది. ఇది ఇప్పుడు రాజకీయంగా రాష్ట్రంలో దుమారానికి కారణం అవుతోంది.
రాష్ట్రంలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా సభలు పెట్టి అనేక ప్రభుత్వ పథకాల లబ్ధిని బటన్ నొక్కుతూ విడుదల చేస్తున్నారు. గతంలో ఈ కార్యక్రమాలను క్యాంప్ ఆఫీస్ లో ఉండి పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టి ప్రజల మధ్య బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలను గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఇంటికి తిప్పుతున్నారు. తాజాగా జగనన్న మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా జోరుగానే ప్రజల్లోకి వెళ్తోంది. జిల్లాల వారీగా నారా చంద్రబాబు నాయుడు పర్యటనలు చేస్తూ కేడర్ ను ఉత్సాహ పరుస్తున్నారు. మరోపక్క నారా లోకేష్ పాదయాత్ర సాగిస్తున్నారు. ఇంకోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులను ఇదేం ఖర్మ పేరుతో ఇంటింటికి వెళ్లేలా చేశారు చంద్రబాబు నాయుడు. తాజాగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన స్టిక్కర్ల కార్యక్రమానికి పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా మరో కార్యక్రమాన్ని చేపట్టింది. మా భవిష్యత్తు చంద్రబాబు.. అంటూ ఇంటింటికి స్టిక్కర్లను అంటిస్తోంది. ఒకపక్క అధికార పార్టీకి పోటీగా స్టిక్కర్లు అంటిస్తూనే.. మరోపక్క అధికార పార్టీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న వాలంటీర్లపైనా న్యాయ పరంగా పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.
ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని పిలుపు..
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన స్టిక్కర్లు అంటించే కార్యక్రమంలో ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు పాల్గొంటే వారిపై ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎక్కడైతే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటిస్తున్నారో.. వారి ఫోటోలు/ వీడియోలు తీసి ఆధారాలతో ఎంపీడీవో, కలెక్టర్, ఎస్పీలకు స్థానిక నియోజకవర్గ ఇన్ చార్జ్ సహకారంతో, లోకల్ లీగల్ టీమ్ సహాయం తీసుకుని ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఫార్మాట్ ను కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసింది.
పథకాల పంపిణీలో కీలకంగా వాలంటీర్లు..
గ్రామ/ వార్డు వాలంటీర్లను అధికార పార్టీ గౌరవ భృతి అందిస్తూ నియమించింది. వీరంతా ఆయా గ్రామాల్లో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్లకు చేరుస్తూ వస్తున్నారు. అయితే, వీరికి పార్టీతో సంబంధం లేదు అంటూ వైసీపీ పెద్దలు ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. వీరిని పార్టీ కార్యక్రమాల్లో భాగం చేయడం అంటే.. ఒకరకంగా అధికార దుర్వినియోగం కింద వస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా ప్రజలను ఒక రకంగా వీరిని ఉపయోగించి భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. ఈ అంశంపైనే ఆధారాలతో సహా ఫిర్యాదులు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో మొత్తంగా ఈ వ్యవస్థ పైనే పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.

వచ్చే ఎన్నికల్లో ఇబ్బందిగా భావిస్తున్న తెలుగుదేశం..
వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమంలో వాలంటీర్లు భాగస్వాములు కావడం వలన ఎటువంటి నష్టము తెలుగుదేశం పార్టీకి లేదు. కానీ, వచ్చే ఎన్నికల్లో వీరు అత్యంత కీలకము కాబోతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీకి వీరి ద్వారా బలమైన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను అధికార పార్టీ కీలకంగా వినియోగించుకోబోతోంది.. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ కొంత నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి వీరిని ఎన్నికలకు ముందే నియంత్రించే చర్యలకు తెలుగుదేశం పార్టీ పూనుకుంది. అందులో భాగంగానే ఫిర్యాదుల ప్రక్రియకు తెరలేపిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది అన్న దానిని బట్టి రాజకీయంగా వేడి పుట్టే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఫిర్యాదులకు భయపడి వాలంటీర్లు ప్రభుత్వం చెబుతున్న కార్యక్రమానికి దూరంగా ఉంటారా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మారింది. ఏది ఏమైనా ఫిర్యాదు అనే పేరుతో కొంతవరకు వాలంటీర్లలో భయాన్ని సృష్టించే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.