
TDP Avirbhava Sabha: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభకు టి టిడిపి సన్నద్ధమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రాల నాయకులతో కలిసి హైదరాబాదులో ఆవిర్భావ వేడుకలను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. హైదరాబాదులో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం వెనుక పార్టీని పటిష్టం చేయాలనే లక్ష్యం ఉన్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి హైదరాబాదులో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా 29న టిడిపి 41 వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు పాల్గొననున్న ఈ సభకు టీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏపీ శాఖతో కలిసి సంయుక్తంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ సభను హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. సభను పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కంటోన్మెంట్ ఎన్నికల కోడ్ కారణంగా అక్కడ సభ నిర్వహణ సాధ్యం కాలేదు.
సానుకూల స్పందన రాకపోవడంతో..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభను ముందుగా నిజాం కాలేజీ మైదానం, ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని టిడిపి నాయకులు భావించి అందుకు అనుగుణంగా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే ఉన్నతాధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించాలని కాసాని జ్ఞానేశ్వర్ సమాయత్తమయ్యారు. సభ నిర్వహణలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా 12 కమిటీలను నియమించారు. 2014 తర్వాత మొన్నటి వరకు తెలంగాణపై చంద్రబాబు దృష్టి పెట్టకపోవడంతో సానుభూతిపరులు ఇతర పార్టీల వైపు వెళ్లారు. ఇటీవల ఖమ్మం సభ విజయవంతం కావడంతో టిడిపి పై అంచనాలు పెరిగాయి. గ్రేటర్ లో టిడిపికి మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్న సమయంలో.. క్యాడర్, పార్టీ సానుభూతిపరులను తిరిగి పార్టీ వైపు తెచ్చుకునే దిశగా టీటీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది.
మైలేజ్ వస్తుందని భావిస్తున్న టిడిపి..
ఈ బహిరంగ సభతో కాస్త మైలేజ్ వస్తుందని, క్యాడర్లో జోష్ నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈనెల 29న జరగనున్న ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో టిడిపి బలోపేతంపై ఇప్పటికే చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఇంటింటికి టిడిపి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ టిడిపి నేతలు కార్యకర్తలు వెళ్లి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని అందిస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో స్థానిక నేతలు పాదయాత్ర చేపడుతున్నారు.

వెనక్కి రావాలని కోరుతున్న చంద్రబాబు..
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఏళ్ల తరబడి ఉండి ఇతర పార్టీలోకి వెళ్లిపోయిన నాయకులు కార్యకర్తలను వెనక్కి రావాలని చంద్రబాబు ఇప్పటికే కోరారు. తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల సంక్షేమానికి టిడిపి ఎంతగానో కృషి చేసిందని, ఎక్కడ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో అభిమానం అని చంద్రబాబు చెబుతున్నారు. ఆవిర్భావ సభ తర్వాత పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయన్న ఆశాభావాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో బలమైన పార్టీగా తెలుగుదేశం ఉందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్న లక్ష్యంతో టీటీడీపీ నేతలు పనిచేస్తున్నారు.