
Sajjala Ramakrishna Reddy: వైసీపీలో నంబర్ టు స్థానం ఎవరిదంటే ..అందరి వేళ్లు సజ్జల రామక్రిష్ణారెడ్డి వైపే చూపిస్తాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కేవలం సలహాదారు పాత్రకే పరిమితం కాకుండా.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అపరిమిత ప్రాధాన్యంతో సజ్జల దూసుకుపోతున్నారు. వైఎస్ సమకాలీకులైన ఎంతో మంది నాయకులు ఉన్నా..తెర వెనుక రాజకీయాలు చేసే సజ్జలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకు తగ్గట్టు వ్యూహాలు రూపొందిస్తూ వైసీపీ విజయాల్లో సజ్జల కీలక భాగస్థుడిగా మారారు. అధినేత జగన్ ఇచ్చిన టాస్క్ ను ఇట్టే పూర్తిచేయగలగడంతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సజ్జల పరపతి పెరిగిపోయింది. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఆయన అమలుచేసి వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫెయిల్యూర్స్ లో అదే సజ్జలపై వ్యూహాలు రూపొందుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా చెప్పాలంటే అపజయాన్ని ఆయనపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అనూహ్యంగా తెరపైకి…
గత ఎన్నికల ముందు వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జలను జగన్ బలంగా నమ్మారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సొంత మనుషులను ఏర్పాటుచేసుకునే క్రమంలో సజ్జలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి త్రయానికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. సజ్జలకు సలహాదారు పదవి ఇచ్చారు. విజయసాయిరెడ్డికి జాతీయ వ్యవహారాలు అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డి అత్యున్నతమైన టీడీపీ పాలకమండలి చైర్మన్ పదవి కట్టబెట్టారు. కానీ అటు తరువాత సజ్జల తన మార్కు రాజకీయాలతో జగన్ కు దగ్గరయ్యారు. ప్రభుత్వ విధానాల నుంచి పార్టీ అంశాల వరకూ సజ్జలకే పూర్తి స్వేచ్ఛ కల్పించారు జగన్. అటు విజయసాయిరెడ్డికి ప్రాధాన్యతను తగ్గిస్తూ ఆయన వద్ద ఉన్న సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల తన తనయుడికి ఇప్పించుకున్నారు.ఇలా సజ్జల హవా పెరుగుతున్న తరుణంలో సొంత పార్టీలో ఆయన వ్యతిరేక వర్గీయులు, ఆయన ఎదుగుదలను తట్టుకోలేని నాయకులు పెరిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఆయన మెడకు చుట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
సగానికిపైగా ఎమ్మెల్యేలకు కోపం…
వైసీపీలో ఉన్న చాలా మంది సీనియర్లే. వారంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పనిచేసిన వారే. కానీ వారంతా ఇప్పుడు సజ్జల కింద పనిచేయాల్సి వస్తోంది. పార్టీ క్యాడర్‌కు సైతం సజ్జలపై చాలా కోపం ఉంది. ఆయన జగన్ ను కలవనీయరని.. అన్నీ తనకే చెప్పుకోవాలంటారని అంటారు. అదే సమయంలో ప్రతీ వ్యవస్థపై ఆయనకే పట్టు ఉంటుంది. ఎవరైనా ఆయన మాటే వినాలి. చివరికి పార్టీ సోషల్ మీడియాను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎలా చూసినా పార్టీపై మొత్తం పట్టు ఆయనకే ఉంది. దీంతో ఆయన ప్రోత్సహిస్తున్న వారు మినహా ఇతరులు తీవ్రంగా మండిపడుతున్నారు. సగం మందికిపైగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లో ఆయనపై ఆగ్రహం ఉంది. కానీ జగన్ ఆయనపై పెట్టుకున్న నమ్మకం కారణంగా చెప్పడానికి వెనుకాడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో అదును కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు దానిని సజ్జలకు ఆపాదించడం ప్రారంభించారు.

నంబర్ టు ప్లేస్ శాశ్వతం కాదు..
వ్యూహాలు అమలుచేయడం, నేతలను బలి పశువు చేయడం జగన్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఆయన పార్టీలో నంబర్ టు స్థానంలో ఎవర్నీ ఎక్కువ రోజులు కూర్చోనివ్వరు. అది తాత్కాలిక గణాంకంగా చూపితేనే తనకు సేఫ్ అన్న విషయం జగన్ కు తెలియంది కాదు. అందుకే ఇప్పుడు ఎదురైన ఓటమి తనది కాదని.. అదంతా సజ్జల వల్ల ఎదురైన పరిస్థితి అని చెప్పేందుకు జగన్ వెనుకాడరు. ఇప్పుడు అనుకూల మీడియా ద్వారా ఇదే ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. అందుకే మరో రెండు నెలల్లో క్రమేపీ సజ్జల కూడా కనిపించకుండా ఉంటారని పార్టీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. వైసీపీ లో రెండో ప్లేస్ ను ఒక్కసారిగా గమనిస్తే.. మొదట వైవీ సుబ్బారెడ్డి తర్వాత ఉమ్మారెడ్డి, మైసూరారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలావరుసగా సీరిస్ కొనసాగుతుంది. ఇప్పుడు సజ్జలను బలి చేయాల్సిన సమయం వచ్చిందని వైసీపీలోనే గట్టిగా ప్రచారం జరుగుతోంది. జగన్ వ్యూహానికి సజ్జల క్లీన్ బౌల్డ్ అవుతారన్న కామెంట్స్ సైతం ఊపందుకుంటున్నాయి.