Sudha Murty: టాటా కంపెనీలో అమ్మాయిలు.. సుధా మూర్తి చేసిన గొప్ప పనేంటో తెలుసా?

సుధా మూర్తి 1974లో బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ చేసింది. అంతకుముందు అదే కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ చదివింది. అయితే ఆమె చదువుతున్న రోజుల్లో స్త్రీలకు అన్ని అవకాశాలు ఉండేవి కావు.

Written By: Bhaskar, Updated On : May 22, 2023 10:08 am

Sudha Murty

Follow us on

Sudha Murty: సుధా మూర్తి.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యురాలు మాత్రమే కాదు.. అంతకుమించిన రచయిత్రి కూడా. ఆమెలో ఒక అమ్మ ఉంది. గుండె గాఢతను అక్షర రూపంలో ప్రదర్శించగల రచయిత్రి ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే మధ్యతరగతి స్త్రీ ఉంది. సుధా మూర్తి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్యగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారు ఆమె. అందుకే ఆమె అంటే ఇన్ఫోసిస్ ఉద్యోగులు చాలా ఇష్టపడతారు. ఆమె తమతో కలిసి సంభాషించే సందర్భాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సుధా మూర్తి బయట మీడియాలో ఫోకస్ అవడం చాలా తక్కువ అని చెప్పాలి. అయితే ఇటీవల కపిల్ కామెడీ షో లో పాల్గొన్నారు. బయట ప్రపంచంలో చాలా హుందాగా ఉండే సుధా మూర్తి.. ఆ కార్యక్రమంలో మాత్రం చాలా హ్యూమర్ ప్రదర్శించారు.. ఈ సందర్భంగా కపిల్ శర్మతో తన వ్యక్తిగత జీవితాన్ని, అందులో గొప్ప సంఘటనలు, చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

జే ఆర్ డీ టాటా కు లేఖ రాసింది

సుధా మూర్తి 1974లో బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ చేసింది. అంతకుముందు అదే కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ చదివింది. అయితే ఆమె చదువుతున్న రోజుల్లో స్త్రీలకు అన్ని అవకాశాలు ఉండేవి కావు. పైగా తన తరగతి గదిలో తను ఒక్కతే అమ్మాయి.. అయితే ఒకరోజు కాలేజీ నోటీసు బోర్డులో పూణే కేంద్రంగా వ్యాపారం నిర్వహించే టాటా అనుబంధ సంస్థ టెల్కో.. తన కంపెనీలో పని చేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలి అంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ ప్రకటన చూసి సుధా మూర్తి మనసు నొచ్చుకుంది.. వెంటనే టాటా సంస్థల అధిపతి జే ఆర్ డి టాటాకు లేఖ రాసింది.

అమ్మాయిలు ఏం కావాలి?

అయితే టాటా తన అనుబంధ సంస్థ అయిన టెల్కో కంపెనీలో అబ్బాయిలు మాత్రమే పనిచేయాలని నోటిఫికేషన్ జారీ చేయడంతో దాన్ని చూసి తట్టుకోలేక సుధా మూర్తి జేఆర్డీ టాటాకులేఖ రాసింది..” దేశ జనాభాలో 50% మహిళలు, 50%శాతం పురుషులు ఉన్నారు. ఇలాంటప్పుడు కేవలం పురుషులు మాత్రమే కావాలి అంటే స్త్రీలు ఎటు వెళ్లాలి?.. ఉద్యోగాలకు సంబంధించి లింగ వివక్ష పాటిస్తే రేపటినాడు స్త్రీ సమాజం ఎటువంటి అసమానతలకు గురవుతుందో మీకు తెలుసా? ఇది సరైన చర్య కాదు అంటూ” సుధా మూర్తి లేఖ రాసింది. ఆ తర్వాత అంటే మార్చి 15న తన పుట్టినరోజు సందర్భంగా జేఆర్డీ టాటా బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ కు వచ్చారు. అంతకుముందే సుధా మూర్తి లేఖ రాయడంతో తనను ఏమైనా అంటారేమోనని భయంతో దూరంగా వెళ్లి జేఆర్డీ టాటా ను చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు టాటా గ్రూప్ సంస్థల్లో అమ్మాయిలకు కూడా అవకాశాలు రావడం మొదలైంది..అంటే తాను రాసిన లేఖ వల్ల టాటా కంపెనీల్లో కూడా స్త్రీలకు అవకాశాలు ఇస్తున్నారని సుధా మూర్తి మనసులో అనుకుంది. ఆ లేఖ రాసిన సందర్భాన్ని సుధా మూర్తి కపిల్ శర్మతో పంచుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్నట్టు సుధా మూర్తి సంభాషణ విన్న చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యానికి, తెగువకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.