Fossil Birds: డైనోసార్ల గురించి విన్నాం. వాటిపై తీసిన జురాసిక్ పార్క్ వంటి సినిమాలనూ చూశాం. మొట్ట మొదటిసారిగా డైనోసార్ బర్డ్ గురించి తెలుసుకోబోతోన్నాం. డైనోసార్ల కంటే భారీ పరిమాణంలో ఉండే పక్షులు కొన్ని శతాబ్దాలపాటు సజీవంగా ఈ భూమి మీద తిరుగాడాయంటే ఆశ్చర్యపోక తప్పదు.
పొరుగు దేశం చైనాలో..
డైనోసార్ పరిమాణంలో భారీ పక్షులు మన పొరుగుదేశం చైనాలో శతాబ్దాలపాటు జీవించాయి. వీటి శిలాజాలను తాజాగా చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా తూర్పు ప్రాంతంలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని గ్ఘెంఘేకౌంటీలో వాటి అవశేషాలను కనుగొన్నారు. ఈ డైనోసార్ పక్షుల ఆవిష్కరణలకు సంబంధించిన పూర్తి వివరాలను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెర్టిబ్రేట్ పాలియోంటాలజీ, పాలియో ఆంత్రోపాలజీ, ఫుజియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోలాజికల్ సర్వే పరిశోధకులు ఈ పక్షి అవశేషాలను గుర్తించారు. 140 నుంచి 150 మిలియన్ ఏళ్ల కిందటి వరకూ ఈ డైనోసార్ బర్డ్స్ జీవించి ఉన్నట్లు నిర్ధారించారు. ఖనిజాలు, మూలకాలు, రాళ్లలోని జీవ రూపాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ పక్షుల శిలాజాలను కనుగొన్నట్లు ది గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
జూరాసిక్ యుగం చివరి నాటికి..
జురాసిక్ యుగం చివరి నాటికి ఇవి నాన్–ఏవియన్ థెరోపాడ్ డైనోసార్‌ల నుంచి వేరు పడి ఉండొచ్చని నిర్ధారించారు చైనా సైంటిస్టులు. గతేడాది అక్టోబర్ 23న చైనా శాస్త్రవేత్తలు గ్ఘంఘే కౌంటీ పరిసరాల్లో సుమారు 200 రోజులకుపైగా తవ్వకాలు జరిపి ఈ సరీసృపాల శిలాజాలను కనుగొన్నారు. ఏడాదిపాటు ఈ శిలాజాలపై విశ్లేషణ జరిపారు. అవి అవియాలే జాతికి చెందిన సరీసృపాలకు చెందినవిగా నిర్ధారణకు వచ్చారు. ఈ డైనోసార్ తరహా పక్షులకు ఫుజియాన్వెనేటర్ ప్రొడిజియోసస్ అని పేరు పెట్టారు. ఫుజియాన్ ప్రావిన్స్ లో డైనోసార్ తరహా శిలాజాలు బయటపడటం ఇదే తొలిసారి.
డైనోసార్ పోలికలు..
ఫుజియాన్వెనేటర్ ప్రొడిజియోసస్ పక్షుల శరీర నిర్మాణం మొత్తం డైనోసార్లను పోలి ఉన్నట్లు సైన్స్ మ్యాగజైన్‌లో విశ్లేషించారు. డైనోసార్ల తరహాలోనే వీటికీ నాలుగు కాళ్లు ఉన్నట్లు తెలిపారు. థెరోపాడ్ డైనోసార్ జాతికి చెందినవని విశ్వసిస్తోన్నారు. ఇవి చాలా వేగంగా పరుగెత్తగలవని, నీటి వనరులకు సమీపంలో నివసించి ఉండొచ్చని విశ్లేషిస్తోన్నట్లు శాస్త్రవేత్త వాంగ్‌మిన్, గ్ఘుఝ లిమింగ్ తెలిపారు. ఈ పక్షుల పుర్రె, దాని పాదాల భాగాలు లభించకపోవడం వల్ల వాటి ఆహారం, జీవనశైలిని గుర్తించడం క్లిష్టతరమైందని పేర్కొన్నారు. దిగువ కాలు ఎముక, దాని తొడ ఎముక కంటే రెండు రెట్లు పొడుగ్గా ఉన్నట్లు గుర్తించామని, సాధారణంగా ఇలాంటి శరీర పరిమాణం థెరోపాడ్ డైనోసార్లల్లో ఉంటుందని చెప్పారు.
ముందు భాగంలో రెక్కలు..
శరీరం ముందు భాగం సాధారణంగా పక్షి రెక్కలాగా, కాలి వేళ్లపై మూడు గోళ్లు ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు వివరించారు. ఇది ఎంత ఎత్తుకు ఎగురుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని, అస్థిపంజర లక్షణాల ఆధారంగా అది ఎగరలేదనే నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. వాటి పొడవాటి కాళ్ల శరీర నిర్మాణ ఆధారంగా చిత్తడి వాతావరణంలో వేగంగా పరుగెత్తగలవని చెప్పారు.