NTR District: సహజంగా రక్తం చూస్తే ఆందోళనకు గురవుతాం. ప్రమాదాలు జరిగిన సమయంలో స్పాట్ లో రక్తం ద్రవిస్తే తెగ భయపడిపోతాం. కళ్లు తిరిగి పడిపోయిన వారూ ఉంటారు. అటువంటిది ఆ గ్రామంలో రహదారిపై రక్తం ఏరులై పారుతోంది. అక్కడ ఎటువంటి ప్రమాదం జరగకున్నా.. నిత్యం రక్తప్రవాహమే జరుగుతోంది. దీంతో గ్రామస్థులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు. ఊరికి అరిష్టం పట్టిందంటూ వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చేతబడి చేయడం వల్లే అలా జరుగుతోందని భావిస్తున్నారు. అసలు రక్తం రావడానికి కారణం ఏమిటో గుర్తించాలని అధికారులను కోరుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు ఎస్సీ కాలనీలో వెలుగుచూసింది ఘటన. వీధిలో సిమెంట్ రోడ్డు ఉంది. దానిపై నీరు పోస్తే చాలు ఎర్రటి ద్రవం ఉబికి వస్తోంది. అదేదో ఒక రోజు జరిగిందంటే కాదు.. నిత్యం పోసినా అదే స్వరూపంలోకి నీరు మారిపోతోంది. అలా ఎందుకు జరుగుతుందో అర్థంకాక గ్రామస్థులు తలలు పట్టుకుంటున్నారు. రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇక పిల్లలు రక్తం మాదిరిగా ఉన్న ద్రవాన్ని చూసి వణికిపోతున్నారు. రోడ్డుపై నీరు వేసేందుకు కూడా సాహిసించడం లేదు.

అయితే ఉబికివస్తున్న రక్తం రూపంలో ద్రవాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. రకరకాలుగా విశ్లేషించి గ్రామస్థులను భయపెడుతున్నారు. చేతబడి చేయడం వల్లే ఇలా రక్తం రూపంలో ద్రవం వస్తుందని చెబుతుండడంతో గ్రామస్థుల భయం రెట్టింపు అవుతోంది. అయితే చదువుకున్న వారు మాత్రం ఈ మాటలను కొట్టిపారేస్తున్నారు. సిమెంట్ రోడ్డు వేసే సమయంలో వినియోగించే కెమికల్స్ వల్లే నీరు రంగు మారుతోందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి.. కారణాలను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.