
Talari Cheruvu Village: అనగనగా ఓ ఊరు. సంవత్సరానికి ఓ రోజు ఆ ఊరంతా ఖాళీ చేస్తారు. పిల్ల,పాప, ముసలి,ముతక, గొడ్డు, గోద.. ఇలా ఒక్కరు కూడా ఆ ఊర్లో కాపురం ఉండరు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ రోజు ఊర్లో ఉంటే ఊరికే అరిష్టమని భావిస్తారు. ఊర్లోని ప్రజలకు నష్టమని భావిస్తారు. ఇంతటి నాగరిక కాలంలో కూడా వింత ఆచారాన్ని పాటిస్తున్నదెక్కడ ? ఆ రోజు ఊర్లో ఉంటే ఊరికి, ఊరి ప్రజలకు వచ్చే నష్టమేంటో తెలుసుకోండి.
అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ మారుమూల కుగ్రామం.. తలారి చెరువు గ్రామం.
తలారి చెరువు వార్తల్లోకి ఎక్కడానికి ఆ ఊరి వింత ఆచారమే కారణం. నాగరిక సమాజంలో ఇప్పటికీ అనాదిగా వస్తున్న
ఆచారాన్ని పాటించడమే ఆ ఊరి కథను వెలుగులోకి తెచ్చింది. ఎక్కడాలేని వింత ఆచారాన్ని ఆ ఊరి జనం పాటిస్తున్నారు.
మాఘ చతుర్దశి నుంచి పౌర్ణమి అర్థరాత్రి వరకు అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తారు. అగ్గిపాడు ఆచారం అంటే..
ఊరంతా కరెంటును, ఇళ్లలోని దీపాలను ఆర్పేయడం. ఈ ఆచారాన్ని ఏళ్లతరబడి పాటిస్తున్నారంటే ఆశ్చర్యం మన వంతు అవుతుంది.
అగ్గిపాడు ఆచారాన్ని పాటించడానికి బలమైన కారణం ఉందని గ్రామస్థులు చెబుతారు. పూర్వం తలారి చెరువు గ్రామంలో ఓ బ్రాహ్మణుడి హత్య జరిగింది. ఆ హత్య తర్వాత ఆ ఊళ్లో పుట్టిన పిల్లలు పుట్టినట్టు చనిపోయారు. దీంతో గ్రామస్థులు ఓ బ్రాహ్మణుడికి సమస్యను చెప్పి.. సలహా అడిగారు. దీంతో ఆ బ్రాహ్మణుడు అగ్గిపాడు ఆచారాన్ని పాటించాలని సూచించాడు. బ్రాహ్మణుడి సూచన మేరకు గ్రామస్థులంతా మాఘ చతుర్దశి నుంచి పౌర్ణమి అర్థరాత్రి వరకు ఊరు ఖాళీ చేస్తారు. ఊర్లోని మనుషులు, పశువులతో సహా సమీపంలోని హాజీవలి దర్గాను చేరుకుంటారు.

హాజీవలీ దర్గాలో పౌర్ణమి అర్థరాత్రి వరకు గ్రామస్థులంతా గడుపుతారు. అక్కడే భోజనం తయారు చేసుకుని తింటారు. ఆ తర్వాత గ్రామంలోకి వెళ్తారు. ఇంటికి వెళ్లాక ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఆ తర్వాత ఇంట్లో పూజ నిర్వహిస్తారు. అప్పుడు కానీ మళ్లీ భోజనం చేయరు. ఈ వింత ఆచారాన్ని గ్రామస్థులు ప్రతియేడు పాటిస్తున్నారు. కొందరు ఈ ఆచారాన్ని మూఢనమ్మకం అంటే .. మరికొందరు అనాదిగా వస్తున్న ఆచారమని చెబుతున్నారు. ఈ వైవిధ్యమైన ఆచారమే తలారి చెరువును వార్తల్లోకి నిలబెట్టిందని చెప్పవచ్చు.