US Winter Storm 2022: “బాంబ్” మంచు తుఫాను అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. తుఫాన్ తీవ్రత అంతకంతకు పెరుగుతుండడంతో శ్వేత దేశం నరకం చూస్తోంది.. ఇప్పటివరకు ఆ దేశంలో 59 మంది దాకా మరణించారు.. న్యూయార్క్ పశ్చిమాన ఉన్న ఎరికంట్రీలో 25 మరణాలు చోటు చేసుకున్నాయి..వాన్ కోవర్ నగరానికి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూన్ లేక్ లో క్రిస్మస్ వేడుకలకు వెళ్తున్న ప్రయాణికుల బస్సు మంచు కారణంగా అదుపుతప్పి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 52 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బయటకు వచ్చే పరిస్థితి లేదు
మంచు ప్రభావం వల్ల జనాలు బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ మంచి ప్రభావం క్రిస్మస్ వేడుకలపై పడింది.. కనీసం 60 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా చోట్ల విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. అయితే ప్రజలు బయటికి రాకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రాక్ పర్వత శ్రేణి నుంచి అప్లా చైన్ పర్వతాల దాకా చలి విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 5.5 కోట్ల ప్రజల మీద ఈ తుఫాన్ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది.. చాలా ప్రాంతాల్లో మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నది.

18 లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా బంద్
మంచు ప్రభావం వల్ల 18 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అమెరికన్ అధికారులు చెబుతున్నారు. గ్రేట్ లేక్స్, న్యూయార్క్ లోని బఫెలో నగర సమీపంలో హిమపాతానికి తోడు శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.. బఫెలో విమానాశ్రయంలో ఒక మీటర్ మందంతో మంచు పేరుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా ఇది పరిస్థితి ఉండడంతో ఆదివారం ఒక్కరోజే 1,707 దేశీయ, పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. చలిగాలు తీవ్రతకు వృద్ధులు నరకం చూస్తున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో 500 మీటర్ల మేరే పరిసరాలు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అనారోగ్యానికి గురయిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు హై లిఫ్ట్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. మంచుతో కప్పి ఉన్న ప్రాంతాలను అధికారులు, రెస్క్యూ బృందం తవ్వుతున్నది. కాగా వాతావరణం లో మార్పులే ఈ తుఫాను కు కారణమని అధికారులు చెబుతున్నారు.