Chalapati Rao Love Story: చలపతిరావు అంటే కరుడు కట్టిన విలన్. అమ్మాయిల మానాలు దోచేసే రేపిస్ట్. సిల్వర్ స్క్రీన్ పై ఆయన చేసిన పాత్రల నేపథ్యంలో ఇలాంటి ఇమేజ్ ఆయనకు ఉంది. రియల్ లైఫ్ లో ఆయన దీనికి పూర్తి భిన్నం. ఆయనో రొమాంటిక్ ఫెలో. ఒక అమ్మాయి మనసు దోచి, ప్రేమ వివాహం చేసుకున్నారు. చలపతిరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ అభిమానులతో పంచుకున్నారు. చలపతిరావు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారట. చలపతిరావు ఇష్టపడిన అమ్మాయి నేరుగా తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుందామా అని అడిగిందట. ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమలేఖలు లేవట.

ఆమె తన ప్రేమను వ్యక్తపరిచిన వారం రోజుల్లోనే స్నేహితులు విజయవాడలో తమ వివాహం జరిపించేశారట. ఆ విధంగా ప్రేమించిన అమ్మాయి భార్యగా వచ్చిందని చలపతిరావు వెల్లడించారు. ఆ జనరేషన్లో ప్రేమ పెళ్లి అంటేనే సంచలనం, అలాంటిది పేరెంట్స్ లేకుండా లేచిపోయి వివాహం చేసుకోవడం అంటే మామూలు సాహసం కాదు. ముందుగా ఆ అమ్మాయి తెగువను మెచ్చుకోవాల్సిందే.
నా భార్య చాలా ధైర్యవంతురాలు. ఒకసారి ఏకంగా ఎన్టీఆర్ నే నిలదీసింది. ఎన్టీఆర్ వద్దకు వెళ్లి మీరు మా ఆయనకు మంచి పాత్రలు ఎందుకు ఇవ్వడం లేదని గట్టిగా అడిగింది. మా ఆవిడ గడుసు తనానికి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయారని ఆయన వెల్లడించారు. దురదృష్టవశాత్తు ముగ్గురు పిల్లలు పుట్టాక చలపతిరావు భార్య కన్నుమూశారు. తక్కువ ప్రాయంలోనే ఆమె జీవితం ముగిసింది. భార్య మరణంతో ఒంటరి అయిన నన్ను రెండో వివాహం చేసుకోమని చాలా మంది బలవంతం చేశారు. పిల్లల భవిష్యత్తు ముఖ్యం అనుకుని… నేను మరో వివాహం చేసుకోలేదని చలపతిరావు చెప్పుకొచ్చారు. అలాగే భార్యకు ఇచ్చిన మాట కోసం మందు, సిగరెట్ వంటి వ్యసనాల జోలికి పోలేదని ఆమెపై తన ప్రేమ చాటుకున్నారు.

చలపతిరావు ఇద్దరు కుమార్తెలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక కొడుకు రవిబాబును వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. తండ్రి మాదిరి రవిబాబు విలన్ గా సెటిల్ అయ్యారు. అయితే రవిబాబు మంచి దర్శకుడు కూడా. జయాపజయాలతో సంబంధం లేకుండా న్యూ ఏజ్ డ్రామాలు ఆయన తెరకెక్కిస్తూ ఉంటారు. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు మూస ధోరణికి దూరంగా ఉంటాయి. ఆయన రూపొందించిన అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, నువ్విలా, నచ్చావులే, అవును హిట్ టాక్ తెచ్చుకున్నాయి.