Chalapthi Rao : చలపతిరావు క్లాస్ మేట్ ఇందుమతిని ప్రేమించారు. 19 ఏళ్ల వయసులోనే చలపతిరావు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. స్నేహితుల సహాయంతో చలపతిరావు విజయవాడ గుడిలో ఇందుమతి మెడలో పెద్దలకు తెలియకుండా తాళి కట్టాడు. పేరెంట్స్ అంగీకరించరు అనే భయంతో విజయవాడలో మిత్రుల సహాయంతో కాపురం పెట్టారు. అప్పుడే రవిబాబు జన్మించాడు. కొన్నాళ్లకు వీరి వివాహాన్ని ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. విజయవాడలో ఉంటున్న సమయంలోనే సినిమాల్లోకి వెళతానని చలపతిరావు భార్యతో అన్నారు. ఆమె అంగీకారం తెలపడంతో చెన్నై వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఫ్యామిలీని కూడా చెన్నైకి షిఫ్ట్ చేశారు. సినిమా అవకాశాల కోసం చలపతిరావు దర్శకులు, హీరోల చుట్టూ తిరిగేవారు.అప్పటికే స్టార్ గా వెలిగిపోతున్న ఎన్టీఆర్ ని చలపతిరావు తరచూ కలిసేవారట. సినిమాల్లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. అవకాశాలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు రావో చెప్పలేము, కుటుంబంతో పాటు ఇక్కడ అవస్థలు పడే కంటే ఇంటికి వెళ్ళిపోయి ఉద్యోగమో, వ్యవసాయమో చేసుకో అని ఎన్టీఆర్ సలహా ఇచ్చారట. అయితే చలపతిరావు మొండిపట్టు నచ్చడంతో దర్శక నిర్మాతలకు చలపతిరావు పేరు ఎన్టీఆర్ సూచించారట.
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చలపతిరావుకు మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే కథానాయకుడు మూవీ ఆర్థిక ఇబ్బందులతో అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఈ లోపు చలపతిరావుకు మరికొన్ని చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. నటుడిగా పుంజుకుంటున్న రోజుల్లో ఆయన జీవితంలో విషాదం చోటు చేసుకుంది. చలపతిరావు భార్య ఇందుమతి ప్రమాదవశాత్తు కన్నుమూశారు.
ఆ రోజుల్లో చెన్నై నగరంలో నీళ్లు అర్ధరాత్రి మాత్రమే వచ్చేవట. రోజుకు సరిపడా నీళ్లు రాత్రివేళ లేచి పాత్రల్లో పట్టేవారట ఇందుమతి. అలా ఓ రోజు అర్ధరాత్రి లేని నీళ్లు పట్టే సమయంలో చలపతిరావు భార్య అగ్నిప్రమాదానికి గురయ్యారట. మంటలు భీకరంగా వ్యాపించడంతో ఆమె శరీరం చాలా వరకు కాలిపోయిందట. ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఇందుమతి కన్నుమూశారు. ఎన్టీఆర్ కుటుంబానికి బాగా దగ్గరైన చలపతిరావును మరో వివాహం చేసుకోమని ఎన్టీఆర్ దంపతులు సూచించినా ఆయన ససేమిరా అన్నారట. పిల్లల భవిష్యత్ కోసం 29 ఏళ్ల వయసులో భార్యను కోల్పోయినా మరో వివాహం చేసుకోలేదు.