Chalapathi Rao Wife: క్యారెక్టర్ ఆర్టిస్టుగా తిరుగులేని స్టార్ డం అనుభవించిన చలపతిరావు… ఆ స్థాయికి వచ్చేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. తల్లిదండ్రులు చదువుకోమని చెప్తే చదువు అబ్బక సినిమా రంగంలోకి వచ్చారు. అప్పట్లో సినిమాలోకి రావాలంటే ఖచ్చితంగా నాటకాలు వేసి ఉండాలి.. అలా చలపతిరావు వందలాది నాటకాలు వేసినప్పటికీ సినిమా అవకాశాలు అంత సులభంగా రాలేదు. చెన్నైలో ఆకలికి పస్తులున్న రోజులు, గది అద్దె కట్టలేక ఓనర్ కు భయపడి బస్ స్టేషన్లో తలదాచుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.. సూపర్ స్టార్ కృష్ణ సినిమా గూడచారి 116 ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ.. చలపతిరావు ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు.. మొదట్లో అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ .. తర్వాత అవి కూడా రావడం మానేశాయి.. అప్పటికే పెళ్లి చేసుకున్న చలపతిరావు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు.. 1500 రూపాయలు అద్దె చెల్లించే ఇంటి నుంచి 12 రూపాయలు మాత్రమే చెల్లించ గలిగే చిన్న రేకుల షెడ్డులోకి మారాడు.

ఎన్టీఆర్ ను చలపతిరావు భార్య నిలదీసింది
చలపతిరావుకు ఇందుమతితో వివాహమైంది.. కానీ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కుటుంబం గడవడం కష్టమైంది.. కనీసం స్టూడియోలకు వెళ్లేందుకు జేబులో పైసా కూడా లేకపోవడంతో ఆ రోజుల్లో ఇందుమతి ధైర్యం చేసి తన పుస్తెలతాడు అమ్మి డబ్బు ఆయన చేతిలో పెట్టింది. ఒకానొక దశలో సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇందుమతి సీనియర్ ఎన్టీఆర్ ను నిలదీసింది..” నా భర్తకు ఏం తక్కువ? శోభన్ బాబు కంటే అందంగా ఉంటాడు. ఎత్తుగా, ఆజాను బహుడిలా దర్శనమిస్తాడు.. మీరు కచ్చితంగా అవకాశాలు ఇవ్వాల్సిందే అంటూ” నిలదీసింది.. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ చలపతిరావును తన దగ్గరకు పిలిపించుకొని జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ప్రతి మగవాడి విజయం వెంట ఒక ఆడది ఉంటుంది.. అది నీ విషయంలో మరింత బలంగా రుజువైంది అని చలపతిరావు భుజం తట్టి అనునయించాడు.. తర్వాత ఆయన నటించిన అనేక సినిమాల్లో చలపతిరావుకు అవకాశాలు ఇచ్చాడు.. ఇక అప్పటినుంచి చలపతిరావు కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశం లేకుండా పోయింది.. ఈ విషయాన్ని చలపతిరావు పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు.

మూడు తరాల వారితో కలిసి..
సీనియర్ ఎన్టీఆర్ తో చలపతిరావు కు ప్రత్యేక అనుబంధం ఉంది.. ఆ అనుబంధంతోనే సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఎక్కువ సహాయ నటుడి పాత్రలు ఆయనకు దక్కాయి. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి వంశంలో మూడు తరాల కథానాయకులతో నటించే అవకాశం ఆయనకు లభించింది..”యమగోల”, “యుగ పురుషుడు”,” డ్రైవర్ రాముడు”, “అక్బర్ సలీం అనార్కలి”, ” భలే కృష్ణుడు”, “సరదా రాముడు”, “జస్టిస్ చౌదరి”, ” బొబ్బిలి పులి”, ” చట్టంతో పోరాటం”, ” దొంగ రాముడు”, “సింహాద్రి”, “చెన్నకేశవరెడ్డి”‘ “సింహా”, “దమ్ము”, “లెజెండ్” ఇలా ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడి పాత్రల్లో నటించారు. ఒకానొక దశలో బాలకృష్ణ ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేస్తున్నారంటే అందులో చలపతిరావు కు కచ్చితంగా ప్రత్యేకంగా ఒక పాత్ర ఉండేది. ముఖ్యంగా చలపతిరావు పాత్ర విషయంలో దర్శకుడు వీ.వీ వినాయక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. తన కెరియర్ లో తన భార్య ఇందుమతిది ప్రత్యేక పాత్ర అని చలపతిరావు పలు సందర్భాల్లో కొనియాడారు. తాను నటిస్తున్న నాటకంలో హీరోయిన్ పాత్ర కు ఎవరు దొరకపోవడంతో తన భార్యను హీరోయిన్ గా పెట్టి నాటకం వేశారు.. ఇది జనాలను బాగా అలరించింది.. ఇందుమతి నటనకు గానూ అనేక పురస్కారాలు లభించాయి.