
YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్.షర్మిల ప్రాణాలకు ముప్పుందా.. అందుకే ఆమో ఏపీని పూర్తిగా వీడిందా.. తెలంగాణలో మకాం వేసింది ప్రాణభయంతోనేనా అంటే అవుననే సమాధానం వస్తోంది పొలిటికల్ సర్కిల్స్ నుంచి. ‘తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ’ అని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రకటించినప్పుడు అందరూ నవ్వారు. అంత పెద్ద జర్నలిస్టు ఇంత కామెడీ అయిపోయారేంటి అనుకున్నారు. ఎందుకంటే నిజంగానే ఆ ఆలోచన అంత కామెడీగా ఉందన్నమాట. కానీ నిజంగానే షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేశారు. ఇక నేను ఏపీకి పోనే పోనని.. తన కర్మభూమి తెలంగాణ అంటున్నారు.
ఎమ్మెల్యేగా కూడా గెలవని తెలిసినా..
అసలు షర్మిల కూడా తన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడం కష్టమని కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు కూడా అంచనా వేస్తారు.. అలాంటిది షర్మిలకు తెలియనిదేం కాదు. అయినా షర్మిల ఎందుకు తెలంగాణను ఎంచుకున్నారు? అన్నతో కనీసం పలకరింపులు కూడా ఉండటం లేదు? షర్మిల కూడా కడప ఎంపీ సీటును కోరుకున్నారా? ఈ సందేహాలు చాలా రోజులుగా ఉన్నాయి. ఆస్తుల గొడవలని మరొకటిని చెప్పుకున్నారు. కానీ వివేకా హత్య కేసులో సునీల్‌యాదవ్‌కు బెయిల్ ఇవ్వవొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఉన్న కొన్ని సున్నితమైన వివరాలు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.
వివేకా గతే పడుతుందని ఊహించే..
కడప ఎంపీ టిక్కెట్ వైఎస్.అవినాష్‌రెడ్డికి ఇవ్వవొద్దని వివేకానందరెడ్డి పట్టుబట్టారని, షర్మిలకు అవకాశం కల్పించాలని ఆయన కోరారని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. పోటీ చేయడానికి షర్మిలను వివేకానందరెడ్డి కన్వెన్స్ చేశారని కూడా తెలపింది. అంటే.. కడప ఎంపీ టిక్కెట్‌పై కుటుంబంలో ముందస్తుగానే చర్చలు జరిగాయని తెలుస్తోంది. షర్మిల కూడా రాజకీయంగా మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కానీ ఆమెకు పార్టీలో అసలు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం ఎంపీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు. రాజ్యసభ కూడా ఇవ్వలేదు. షర్మిల పార్టీలోకి ఏ రూపంలో ఎంట్రీ ఇచ్చినా ఆమె పవర్ సెంటర్ అవుతుందన్న కారణంగానే .. తాను జైల్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడినప్పటికీ కనీసం చిన్న అవకాశం ఇవ్వడానికి కూడా జగన్ అంగీకరించలేదన్న ప్రచారం ఉంది. వైసీపీలో మరో పవర్ సెంటర్ అవుతుందన్న ఉద్దేశంతోనే చిన్న అవకాశం కూడా జగన్ ఇవ్వలేదని సమాచారం. మరోవైపు తన అభీష్టానికి వ్యతిరేకంగా వివేకానందరెడ్డి కుటుంబంలో ఒత్తిడి తెచ్చి కడప ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారన్న కోపం.. ఆ ప్రయత్నంలో వివేకానందరెడ్డి దూకుడుగా ఉండటం జగన్‌కు నచ్చి ఉండదని అంచనా వేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు గురవడానికి ముందు రోజు టిక్కెట్ల అంశంపై మాట్లాడి లోటస్ పాండ్ నుంచి పులివెందుల వచ్చారు. ఆ తర్వాత ఒక్క రోజులోనే వివేకా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత షర్మిలకు కూడా బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఆమె సైలెంట్ అయ్యారని సమాచారం.

ప్రాణహాని ఉందనే..
వివేకానందరెడ్డి హత్య తర్వాత షర్మిలకు కూడా పరోక్షంగా ఆ తరహా బెదిరింపులు వచ్చి ఉంటాయని అందుకే ఆమె తెలంగాణలో రాజకీయ భవిష్యత్ వెదుక్కుంటూ దూరంగా వెళ్లిపోయారన్న అభిప్రాయం బలపడుతోంది. వివేకానందరెడ్డి హత్య. .. దానికి దారి తీసిన పరిస్థితులు.. రాజకీయ స్వార్థాలు.. కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా వధించడం వంటి ఘటనలు చూస్తే. తనకూ కూడా మినహాయింపు ఉండదన్న భయంతోనే షర్మిల పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయి ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.
ఈ విషయం నిజమైనా షర్మిల అంగీకరించలేదు.. అబద్ధమని ఖండించనూ లేరు. ఈ విషయం ఎప్పటికీ రహస్యంగానే ఉండే అవకాశం ఉంది.