
Governor Abdul Nazir: ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్ధుల్ నజీర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ లో జస్టిస్ అబ్దుల్ నజీర్ తో హైకోర్టు చీఫ్ న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే రాష్ట్ర గవర్నర్ గా ఓ మాజీ న్యాయమూర్తి నియామకంపై మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కారును కట్టడి చేసేందుకేనన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానం పాలన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యంపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న తరుణంలో ఓ మాజీ న్యాయ కోవిదుడి నియామకం చర్చనీయాంశంగా మారింది. విశ్వభూషణ్ హరిచందన్ జగన్ కు అన్నివిధాలా సహకరించడం వల్లే ఆయన మార్పు జరిగిందని ప్రచారం జరుగుతోంది. మరీ ఏఉద్దేశ్యంతో జస్టిస్ అబ్ధుల్ నజీర్ ను నియమించారో అంతుపట్టడం లేదు.
అయితే తాజాగా గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నియామకం వెనుక భారీ స్కెచ్ నడిచినట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం బ్యూరోక్రట్ల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ జగన్ సర్కారు తన సొంత సైన్యంలా భావిస్తున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి లేకుండా విధ్వంసాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. సంక్షేమం మాటున రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీని కలిసిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానని అప్పట్లో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులు, శాంతిభద్రతలు, అధికార పార్టీ దురాగతాలపై నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. దాని ఫలితమే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గవర్నర్ గా ఎంపిక అని ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల్లో ఆయన పని మొదలు పెడతారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏపీలో న్యాయవ్యవస్థపై అధికార పార్టీ అనుచిత వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. పాలనలో న్యాయవ్యవస్థ ప్రమేయాన్ని సాక్షాత్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ తీరును ప్రశ్నించాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఒకరిద్దరు నేతలు జైలు గడప కూడా తొక్కారు. ఇటువంటి సమయంలో ఒక న్యాయ నిపుణుడ్ని గవర్నర్ గా నియమించడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ నియామకంతో బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. గవర్నర్ ద్వారా రాజకీయాలు చేసే స్థాయి బీజేపీకి ఏపీలో లేదు. అటువంటప్పుడు ఈ గవర్నర్ మార్పు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికి అనుకూలమన్న ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.
జస్టిస్ అబ్ధుల్ నజీర్ అనుభవమున్న న్యాయనిపుణుడు. కీలక తీర్పులు వెలువరించిన నేపథ్యం ఉంది. ఆయన స్వరాష్ట్రం కర్నాటక. 1983లో బార్ కౌన్సిల్ లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యారు. చరిత్రాత్మకమైన బాబ్రీమసీదు-రామజన్మభూ వివాదంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. అటువంటి వ్యక్తిని ఏరికోరి ఏపీకి పంపించడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఇచ్చిన నివేదికతోనే ప్రధాని స్పందించిన ఈ న్యాయ నిపుణుడ్ని ఏపీకి నియమించినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.