Jagan- MLAs: అవసరం లేకుంటే దేవుడికే దండం పెట్టని కాలం. నాయకుడిని గుడ్డిగా నమ్ముకుని ఉంటారా. జగన్ వెంటే ఎప్పుడూ ఉండాలని రూల్ లేదు. జగన్ వెంట తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలమ్మ ఉన్నారా ?. రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది. అలా అని జగన్ సోనియాగాంధీకి విధేయుడుగా ఉన్నారా ? “ ఇది వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేల మనోగతం. వరుసబెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ వ్యవహార శైలి పై చర్చ జోరుగా జరుగుతోంది.

వైఎస్ జగన్ ఓ ప్రత్యేకమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. తనను ఆహా.. ఓహో అంటూ పొగడాలని కోరుకుంటాడు. అలాంటి వారినే తన చుట్టూ ఉంచుకుంటారు. తనతో సమానంగా ఇమేజ్ ఉన్న వారిని కనీసం పక్కన కూడా ఉండనివ్వరు. అది ఆయనకు నచ్చదని జగన్ అంతరంగం తెలిసిన వారు చెబుతుంటారు. తన కంటే అన్ని రకాలుగా తక్కువ స్థాయి ఉన్నవారే తన వెంట ఉండాలని కోరుకుంటాడు జగన్. ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. వైసీపీ పెట్టిన తొలినాళ్లలో సినీనటులు జీవిత, రాజశేఖర్ జగన్ సభలకు వచ్చేవారు. స్వతహాగా సినీ నటులు కావడంతో … జగన్ సభల్లోని జనం జీవితారాజశేఖర్ పట్ల క్రేజ్ చూపించారు. ఇది గమనించిన జగన్ ఆ తర్వాత వారిని వైసీపీ సభలకు క్రమంగా దూరంపెట్టారని అప్పట్లో టాక్ నడిచింది.
జగన్ సింహంలాంటోడు. సింగిల్ గా వస్తాడని వైసీపీ నేతలు పొత్తుల గురించి మాట్లాడినప్పుడు పొగుడుతూ ఉంటారు. కానీ జగన్ సింగిల్ రావడానికి మరో కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేంటంటే.. ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటే వారితో కలిసి ప్రచారం చేయాలి. వారితో కలిసి నడవాలి. వారి మాటకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవన్నీ జగన్ కు నచ్చవు. జగన్ చెప్పినట్టు వింటేనే జగన్ కు నచ్చుతుంది. అందుకే పొత్తుల విషయంలో జగన్ ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఓటమినైనా భరిస్తారు కానీ ఇంకొకరితో షేరింగ్ చేసుకోవడానికి జగన్ ఇష్టపడరని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ దీనిని కవరింగ్ చేయడానికి వైసీపీ నేతలు పులి, సింహం అంటూ జగన్ ను ఆకాశానికెత్తేస్తుంటారు.

వైసీపీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి పెరగడానికి కూడా జగన్ వ్యవహార శైలి కారణమని వైసీపీ సానుభూతిపరులు భావిస్తున్నారు. కొందరు తమ అధికారాన్ని, పదవుల్ని కాపాడుకోవడానికి జగన్ ను వీరుడు.. శూరుడు అంటూ పొగిడేస్తారని, అలాంటి వారినే జగన్ వెంట పెట్టుకుంటాడని అంటున్నారు. ఇలాంటి వారి వల్లే ఎన్నో ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉన్నవారు పార్టీకి దూరమవుతున్నారని చెబుతున్నారు. రాజకీయాలంటేనే.. నాకు ఇది, నీకు అది అన్నట్టు ఉంటుంది. ప్రయోజనం లేకుండా రాజకీయం చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. ప్రయోజనం దక్కకపోతే సొంతదారి చూసుకుంటారు. అది జగనైనా.. షర్మిలైనా. ఇప్పుడు షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టిందో కూడా చర్చకు వస్తోంది. అన్న జగన్ అధికారంలో ప్రాధాన్యత ఇవ్వని నేపథ్యంలోనే షర్మిల తనదారి తాను చూసుకుందని తెలుస్తోంది. అలాంటిప్పుడు ఎమ్మెల్యేలు ప్రయోజనం లేనప్పుడు ఎందుకు విధేయులుగా ఉంటారో జగన్ ఆలోచించుకోవాలి.
విధేయత గురించి ఇప్పుడు మరొక చర్చ తెరపైకి వచ్చింది. జగన్ కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని రెండుసార్లు సీఎం చేసింది. లేదంటే సీఎం అయ్యేవారు కాదు. సీఎం అయ్యాక రాజశేఖర్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ వచ్చింది. అంతేకానీ అంతకు ముందు సీఎం అయ్యాక ఉన్నంత ఆదరణ ఉండేది కాదు. రెండుసార్లు సీఎం పదవి ఇచ్చిన కుటుంబానికి జగన్ విధేయుడిగా ఉండకుండా సొంతపార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు సొంతదారి చూసుకుంటే బాధ ఎందుకని కొందరు చెబుతున్నారు. జగన్ విధేయుడిగా ఉండనప్పుడు.. జగన్ విధేయుల్ని కోరుకోవడం ఎంత వరకు సమంజసం అన్న చర్చ జరుగుతోంది. ఉంటే విధేయుడిగా ఉండాలి. లేకుంటే కక్ష సాధింపు చర్యల్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు ఏపీలో నడుస్తున్న వర్తమాన పరిస్థితి ఇది.